
భక్తులకు డివోషనల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ కృత్రిమ మేధ, వర్చువల్‌ రియాలిటీతో శ్రీవారి చరిత్ర ఆవిష్కరణ 16న సీఎం చేతుల మీదుగా ప్రారంభం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 120 మంది భక్తులు కూర్చొనేలా ఏర్పాటుచేసిన మెయిన్‌ హాల్‌ ఈనాడు డిజిటల్, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల నిరీక్షణ సమయాన్ని వృథా పోనివ్వకుండా, వారిలో ఆధ్యాత్మిక చింతనను, ప్రశాంతతను కలిగించేందుకు తితిదే వినూత్న అడుగువేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), వర్చువల్‌ రియాలిటీ(వీఆర్‌) తదితర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో రూ.4 కోట్లతో ‘డివోషనల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌’(హీలింగ్‌ సెంటర్‌)ను ఏర్పాటు చేసింది. దీనిని సీఎం చంద్రబాబు ఈ నెల 16న ప్రారంభించనున్నారు. గతేడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు తిరుమల వచ్చినప్పుడు చేసిన సూచనల మేరకు ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. ప్రతి దేవాలయంలోనూ భక్తులకు ఆత్మశాంతిని, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ఒక ‘హీలింగ్‌ సెంటర్‌’ ఉండాలని ఆయన సూచించారు. అందుకు అనుగుణంగా తితిదే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో డివోషనల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను తీర్చిదిద్దింది. మెడిటేషన్‌ శిక్షణ గది ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో సుమారు 340 అంగుళాల(8.4 మీటర్ల పొడవు, 2.025 మీటర్ల వెడల్పు) భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. మెయిన్‌ హాల్‌లో 120 మంది భక్తులు కూర్చోవచ్చు. ప్రత్యేకంగా నిర్మించిన మెడిటేషన్‌ (ధ్యానం), శిక్షణ గదుల్లో మరో 40 మంది (20+20) కూర్చునే అవకాశం కల్పించారు. వైకుంఠాన్ని తలపించేలా పచ్చదనం(గ్రీన్‌ స్కేప్‌), ఇత్తడితో చెక్కిన శంఖుచక్రాల ఆకృతులు, విశ్వశక్తిని ప్రతిబింబించేలా వృత్తాకార ఫ్లోరింగ్‌తో దీన్ని రూపొందించారు. దశావతారాల విశిష్టతను కలంకారీ కళారూపాలతో, అద్భుత లైటింగ్‌తో వివరించేలా డిజైన్‌ చేశారు. భక్తులు స్వామివారి తత్వాన్ని నేర్చుకుని, ప్రశాంతంగా దర్శనానికి వెళ్లేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. నిరీక్షణే ధ్యానం: ‘నిరీక్షణ అనేది ఒక ధ్యానం.. ధ్యానం అనేది ఒక అభ్యసనం.. అభ్యసనం అనేది ఒక భక్తి’ అన్న భావనతో భక్తులకు స్ఫూర్తిగా నిలిచేలా హాల్‌లో ఏర్పాటుచేశారు. శ్రీవారి సుప్రభాతంలో వర్ణించినట్లుగా ఆ బ్రహ్మాది దేవతలే పుష్కరిణి వద్ద స్వామివారి తొలి దర్శనం కోసం వేచి ఉంటారని, సాధారణ మనుషులమైన మనం ఎంత ఎక్కువ సమయం వేచి ఉంటే అంత ఎక్కువ ఆశీస్సులు దక్కుతాయనే సత్యాన్ని ఈ కేంద్రం ద్వారా తెలియజెప్పనున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 17వ కంపార్ట్‌మెంట్‌ను పైలట్‌ ప్రాజెక్ట్‌ కోసం ఎంపిక చేశారు. భవిష్యత్తులో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1, 2తో పాటు నారాయణగిరి గార్డెన్స్‌లోని మొత్తం 66 కంపార్ట్‌మెంట్లలోనూ పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి, ఈ ప్రధాన కేంద్రం నిర్వహించే గైడెడ్‌ మెడిటేషన్, వేద పఠనం, పౌరాణిక కథల దృశ్యాలను ఆధ్యాత్మిక కథలను ప్రసారం చేయనున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





