
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ముందుగా టికెట్లు బుక్ చేసుకోకుండా వచ్చే భక్తుల కోసం టీటీడీ తిరుపతిలో ఎస్ఎస్డీ టోకెన్లను జారీ చేస్తోంది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఈ ఎస్ఎస్డీ టోకెన్ల జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎస్ఎస్డీ టోకెన్లను టీటీడీ ఇవాళ నిలిపివేసింది. బుధవారం రోజు గురువారం దర్శనానికి సంబంధించి జారీ చేయనున్న టోకెన్లు ఇవ్వరని టీటీడీ తెలిపింది. కాబట్టి భక్తులు ఇవాళ నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శనం చేసుకోవాలని టీటీడీ సూచించింది. గురువారం మధ్యాహ్నం శుక్రవారం దర్శనానికి సంబంధించి టోకెన్లు జారీ చేస్తారని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.టీటీడీ ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వచ్చిన వారు నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శనం చేసుకునేలా ప్లాన్ చేసింది. అందుకే ప్రతి బుధవారం ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.. గత ఆరు నెలల్లో 7 వారాల పాటు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరిశీలిస్తోంది. ఎస్ఎస్డీ టోకెన్ల జారీ చేయకపోవడంతో దూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు ఇబ్బందిపడుతున్నారు. భక్తులు పరిస్థితిని గమనించి తిరుమలకు రావాలని టీటీడీ సూచిస్తోంది. అంతేకాదు బుధవారం దర్శనం కోసం మంగళవారం ఉదయం ఆరు గంటలకే పది వేల ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయగా.. వీరికి బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం అవుతుందని చెబుతున్నారు. ఇటు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు మంగళవారం రోజు 2 వేల టోకెన్లు జారీ చేశారు.తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో సాత్తుమొరతిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఇవాళ శ్రీ చక్రత్తాళ్వార్ సాత్తుమొర, శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు శ్రీ లక్ష్మీనారాయణస్వామి వారి ఆలయం నుంచి ఉభయ నాంచారులతో కూడిన శ్రీ వరదరాజస్వామివారిని, శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో మంగళవాయిద్యాల నడుమ ఊరేగిస్తారు. ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు తిరుమల నుంచి వచ్చిన శ్రీవారి అప్పపడి ప్రసాదాన్ని శ్రీ కోదండరామాలయం నుంచి శ్రీ లక్ష్మీనారాయణస్వామి వారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొస్తారు. అనంతరం శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొర నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగిస్తారు. అనంతరం శ్రీ ఆండాళ్ అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది.శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని మొదటి గోపురంలో పుష్యమి నక్షత్రం రోజున శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ప్రతిష్ఠించినట్లు ఆలయ సంప్రదాయం. స్వామివారి ప్రతిష్ఠాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం శ్రీ చక్రత్తాళ్వార్ సాత్తుమొరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ కాంచీపురంలో జన్మించిన ప్రముఖ సంస్కృత పండితులు, శ్రీవైష్ణవాచార్యులు. తిరుమల శ్రీవారిని మేల్కొలిపే శ్రీవారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వంటి పవిత్ర రచనలను ఆయన అందించారు. శ్రీభాష్యం, శ్రీభాగవతం తదితర మహాగ్రంథాలకు వ్యాఖ్యానాలు కూడా రచించారు. ఆయన జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం శ్రీ ప్రతివాది భయంకరన్ అన్నన్ సాత్తుమొరను నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 14న శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ ఆండాళ్ అమ్మవారి శాత్తుమొర సందర్భంగా ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారిని అలిపిరికి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం అలిపిరి నుంచి గీతామందిరం, రామనగర్ క్వార్టర్స్, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్.ఎస్. మాడ వీధి, చిన్నజీయర్ మఠం మీదుగా స్వామి, అమ్మవార్ల ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. ఈ పవిత్ర ఉత్సవంలో భక్తులు పాల్గొని శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందాలని టీటీడీ కోరింది.




