
వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సంపత్ రాజ్. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాతో టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత శ్రీమంతుడు వంటి చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవాలను పంచుకున్న సంపత్ రాజ్.. మహేష్ బాబు, ప్రభాస్, దర్శకుడు కొరటాల శివ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. శ్రీమంతుడు సినిమాలో తన పాత్రకు సంబంధించిన విషయాలను గుర్తుచేసుకున్న సంపత్ రాజ్.. దర్శకుడు కొరటాల శివ తనను సంప్రదించిన తీరును వివరించారు. కొరటాల శివ కథ చెప్పిన విధానం, రచయితగా ఆయనపై తనకున్న నమ్మకం.. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటని తెలిపారు. కథను వివరించేటప్పుడు తన పాత్రను తాను తప్పకుండా చేయాలని కొరటాల శివ కోరారని, ఆయన కథనంలో ఉన్న బలమే తనను ఆకట్టుకుందని చెప్పారు.




