
దర్శకుడు శివనాగేశ్వరరావు తన కెరీర్లో అత్యంత కీలకమైన, మరచిపోలేని సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంటూ, తన తొలి చిత్రం మనీ విడుదలకు ముందు, తర్వాత ఎం.ఎస్.రెడ్డి గారితో జరిగిన అనుభవాలను వివరించారు. మనీ సినిమా విడుదలకు ముందు, అన్నపూర్ణ స్టూడియోలో ఎం.ఎస్.రెడ్డి గారు, సి.నారాయణ రెడ్డి గారు ఈ సినిమా ప్రత్యేక ప్రొజెక్షన్లో వీక్షించారు. సినిమా పూర్తయిన తర్వాత, ఎం.ఎస్.రెడ్డి గారు దర్శకుడి భుజంపై చేయి వేసి, “నాగేశ్వరరావు, దీంట్లో పల్లెటూరి జనం చూడటానికి ఏముంది.?” అని సూటిగా ప్రశ్నించారట. ఆయన అలా అనడంతో దర్శకుడికి కొంత నిరుత్సాహాన్ని కలిగించిందట. అప్పటికే సినిమా విడుదల అవుతుందో లేదో అన్న అనుమానంలో ఉన్న శివనాగేశ్వరరావుకు ఈ మాటలు మరింత ఆందోళన కలిగించాయట. అయితే, మనీ సినిమా విడుదలైన తర్వాత అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఇది అన్నపూర్ణ స్టూడియోలో 50 రోజులకు పైగా, ఓడియన్ థియేటర్లో 130 రోజులకు పైగా ఆడి అఖండ విజయం సాధించింది. ఈ విజయానికి గుర్తుగా వంశీ బర్క్లీ, వంశీ రామరాజులు మనీ యూనిట్‌కు అభినందన సభను త్యాగరాయ గానసభలో ఏర్పాటు చేశారు. శివనాగేశ్వరరావుకు సన్మానాలు ఇష్టం లేకపోయినా, మనీ యూనిట్‌కు అభినందన సభ అనే పేరుతో సరేనని ఒప్పుకున్నారు. ఈ సభకు ఎం.ఎస్.రెడ్డి గారు అధ్యక్షత వహించారు. సభ అనంతరం, దర్శకుడు శివనాగేశ్వరరావుకు సత్కారం ప్రకటించగా, ఆయన వేదికపైకి రావడానికి ఆలోంచించారట. అప్పుడు ఎం.ఎస్.రెడ్డి గారే స్వయంగా శివనాగేశ్వరరావును వేదికపైకి లాక్కొని, శాలువా కప్పి, బొకే అందించి సత్కరించారు.





