
కొండా దంపతుల పునరుద్ఘాటన రానున్న రోజుల్లో మురళీకి ఓ పదవి.. తనకు మళ్లీ మంత్రి పదవి వస్తుందన్న సురేఖ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కొండా సురేఖ, చిత్రంలో మురళి తదితరులు ఈనాడు, వరంగల్‌: తమ గురించి అనేక ఊహాజనిత వార్తలు వస్తున్నాయని.. తాము కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి పునరుద్ఘాటించారు. విలువలకు కట్టుబడి రాజకీయం చేశామని, రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు. మాజీ ఓఎస్డీ సుమంత్‌ తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆయన్ను పరామర్శించేందుకు నియోజకవర్గ కేంద్రానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం తమ అనుచరులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ సుమంత్‌ బెయిల్‌ విషయమై హైదరాబాద్‌లో ఉండిపోవడంతో కార్యకర్తలను కలవడం ఆలస్యమైందన్నారు. పార్టీ తనకు మంత్రిగా అవకాశం ఇస్తే మచ్చలేకుండా పనిచేశానని చెప్పారు. నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని.. అప్పుడు తాము బాధపడలేదని, నేడు పదవి పోయినందుకూ బాధ లేదని పేర్కొన్నారు. కానీ అకారణంగా తొలగించారనేది తన వేదన అన్నారు. తనను రాజీనామా చేసి పోటీ చేయాలంటున్న వాళ్లు కార్పొరేటర్‌గా గెలవడం గొప్పన్నారు. ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలు ఎక్కువయ్యాయని కొండా దంపతుల గురించి మాట్లాడే నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ సురేఖ హెచ్చరించారు. చాలారోజుల తర్వాత మైకు దొరికితే ఊగిపోతున్నారని.. ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. రానున్న రోజుల్లో మురళికి ఓ పదవితో పాటు, మళ్లీ తనకు మంత్రి పదవి వస్తుందన్నారు. వచ్చేసారి కూడా వరంగల్‌ తూర్పు సీటు వందశాతం తనదేనని.. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తప్ప మారదని చెప్పారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసి వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలోని 24 డివిజన్లు గెలిపించుకుంటామని సురేఖ ధీమా వ్యక్తం చేశారు. కొండా మురళి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం నుంచి తమకు ఫోన్‌ వచ్చిన మాట నిజమేనన్నారు. పదవి ఉంటుంది.. పోతుంది.. ఎన్నడూ క్షమాపణ చెప్పలేదని పేర్కొన్నారు. బీసీల కోసం ముందుకొచ్చే నాయకుడు లేకుండా పోయారన్నారు. కృతజ్ఞత అనేది కొండా రక్తంలోనే ఉందని.. పార్టీలోనే కొనసాగుతామన్నారు. ‘నాది.. సురేఖది ఒకటే మాట. నా బిడ్డది వేరే మాట. ఆమె వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. నేను కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా. కార్యకర్తల కోసం అవసరమైతే మరో పదెకరాలు అమ్ముతా’ అని అన్నారు. రేవంత్‌రెడ్డికి తన గురించి అన్నీ తెలుసని మురళి వ్యాఖ్యానించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





