
హీరోయిన్ ఆమని దివంగత నటి సౌందర్యతో, ఆమె కుటుంబంతో తనకున్న బలమైన అనుబంధాన్ని ఒక ఇంటర్వ్యూలో వివరించారు. సౌందర్య కుటుంబం వచ్చినప్పుడు వారితోనే ఎక్కువగా గడిపేదానినని, షాట్ పూర్తవగానే వారి పక్కన కూర్చునేదానినని ఆమని తెలిపారు. తాను సౌందర్య కుటుంబంలో ఒకరిలా కలిసిపోయేదానినని, అవుట్ డోర్ షూటింగ్స్ కు వెళ్ళినప్పుడు సౌందర్య రూమ్ లోనే ఆమె పక్కనే పడుకునేదానినని గుర్తుచేసుకున్నారు. డిన్నర్, లంచ్ కలిసి చేసేవారని చెప్పారు. సౌందర్య తండ్రి గారిని తాను కూడా అప్పాజీ అని పిలిచేదానినని ఆమని వెల్లడించారు. సౌందర్య తండ్రి ఒకసారి తనను కోడలిగా చేసుకోమని, తన కొడుకు అమర్ కు ఇచ్చి పెళ్లి చేయమని అడిగారని ఆమని తెలిపారు. అప్పుడు తాను సరదాగా అడుగుతున్నారేమో అనుకున్నానని, “సార్, నేను హీరోయిన్ ను కదా, సినిమాదే దాన్ని. నన్ను ఎలా చేసుకుంటారు?” అని అడిగానని, దానికి ఆయన “మా అమ్మాయి కూడా సినిమా లోనే ఉంది కదమ్మా, తప్పేముంది?” అని అన్నారని వివరించారు. ఆ సమయంలో ప్రముఖ నటి శకుంతల కూడా పక్కనే ఉన్నారని ఆమని తెలిపారు. అయితే, సౌందర్యతో ఈ విషయంపై తాను ఎప్పుడూ చర్చించలేదని చెప్పారు.






