
విశాఖపట్నంలో పులి సంచరిస్తోందంటూ ఉన్నట్టుండి ప్రచారం మొదలైంది.. స్థానికులు కూడా నిజమే అనుకుని భయపడ్డారు. ఆ తర్వాత అసలు సంగతి తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఒక ఆకతాయి చేసిన పనిగా గుర్తించారు.. అతడ్ని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. విశాఖపట్నం పరిధి ఆరిలోవ కాలనీ గోల్ఫ్క్లబ్ వెనుక భాగంలో ఓ రాయల్ బెంగాల్ టైగర్ తిరుగుతోందని సోమవారం రోజు ప్రచారం జరిగింది. సోషల్ మీడియా వేదికగా పులి తిరుగుతున్నట్లుగా ఫోటో ఒకటి వైరల్ కావడంతో క్షణాల్లో వదంతులు మొదలయ్యాయి. ఈ ఫోటో చూసిన స్థానికులు భయపడ్డారు.స్థానికుల్లో ఆందోళన మొదలు కావడంతో అటవీశాఖ అధికారులు, ఆరిలోవ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారంతా ఆరిలోవ కాలనీ గోల్ఫ్క్లబ్ ప్రాంతానికి చేరుకుని ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొద్దిసేపటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో ఫేక్ అని తేల్చారు. అసలు రాయల్బెంగాల్ టైగర్ ఆరిలోవ ప్రాంతంలో ఉండే అవకాశం లేదని అటవీశాఖ అధికారులు, పోలీసులు తేల్చి చెప్పారు. దీనిని షేర్ చేసిన ఓ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనకు మరో డ్రైవర్ ఈ ఫోటు పంపాడని చెప్పగా.. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.అప్పుడు ఆ డ్రైవర్ అసలు మ్యాటర్ ఏంటో చెప్పాడు.. తాను ఏఐ ద్వారా ఈ ఫొటో తయారు చేసినట్లు పోలీసులకు చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. సోషల్ మీడియా వేదికగా సంచలనాల కోసం ఇటువంటి ఫొటోలు పెడుతున్నారని.. పులి తిరుగుతోందనే వదంతులను ఎవరూ నమ్మొద్దని ఆరిలోవ పోలీసులు ప్రజల్ని కోరారు. ఇటీవల కాలంలో ఏఐ సాయంతో చాలామంది ఫేక్ ఫోటోలు సృష్టించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ఫేక్ ఫోటోలు సృష్టించిన ఘటనలే కొన్ని జరిగాయి. కొందరు ఆకతాయిలు చేసే పనికి జనాలు భయపడిపోతున్నారు. మొత్తం మీద విశాఖపట్నం ఆరిలోవ ప్రాంత ప్రజల్ని వణికించిన పులి సంచారం ఫేక్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.





