
పాశ్చాత్య దేశాలు విధించిన సాంకేతిక, దౌత్య పరిమితులను అధిగమించి సొంతంగా ఏఐ పర్యావరణ వ్యవస్థను నిర్మించుకోవడానికి చైనా పట్టుదలగా శ్రమిస్తోంది. ఫలితాలూ సాధిస్తోంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఓపెన్‌ వెయిట్‌ మోడళ్ల సాయంతో ‘ప్రపంచ కృత్రిమ మేధా సహకార సంస్థ(వైకో)’ను నెలకొల్పింది. మరోవైపు, అమెరికా ఏమో ‘ప్యాక్స్‌ సిలికా’తో ముందుకు వచ్చింది. ఈ రెండింటి మధ్య పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. సె మీకండక్టర్‌ చిప్‌లు, వాటి తయారీ సాధనాలు చైనాకు చిక్కకుండా 2022లో జాతీయ భద్రతా కారణాల పేరిట అమెరికా ఆంక్షలు విధించింది. వాటికి ప్రతిగా డ్రాగన్‌ ఓపెన్‌-వెయిట్‌ మోడల్స్‌ను సృష్టించింది. అయితే, ఇవి ఓపెన్‌ సోర్స్‌ మోడల్స్‌కు భిన్నమైనవి. ఓపెన్‌ సోర్స్‌లో సంపూర్ణ పారదర్శక ప్యాకేజీ లభిస్తే, ఓపెన్‌ వెయిట్‌ పాక్షిక ప్యాకేజీని మాత్రమే అందిస్తుంది. ఓపెన్‌ సోర్స్‌లో మార్పుచేర్పులు చేసినట్లుగా ఓపెన్‌ వెయిట్‌లో చేయలేం. అయినాసరే, ఏఐ రంగంలో చైనా ఈ మోడల్స్‌ను విరివిగా అందుబాటులోకి తెచ్చింది. అధిక సామర్థ్యంతో, తక్కువ ఖర్చుకే లభించే డీప్‌సీక్‌ వంటి ఓపెన్‌ వెయిట్‌ మోడళ్లను డెవలపర్లు విరివిగా వినియోగిస్తున్నారు. దీంతో చైనా ఏఐ మోడళ్లకు ప్రాచుర్యం లభించడంతో పాటు ఆర్థిక, వ్యూహపరమైన ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయి. ఈ క్రమంలో ఓపెన్‌ వెయిట్‌ మోడళ్ల సాయంతో శాశ్వత ఏఐ సంస్థాగత వ్యవస్థగా ‘ప్రపంచ ఏఐ సహకార సంస్థ(వైకో)’ను చైనా నెలకొల్పింది. ఏఐ రంగంలో తనను వెనక్కి నెట్టడానికి ఉద్దేశించిన పరిమితులనే ఇప్పుడు ప్రపంచ ఏఐ నియమాలను తిరగరాయడానికి డ్రాగన్‌ ఉపయోగిస్తోంది. కానీ, ఇదే పారదర్శకతను ఇప్పుడు పాశ్చాత్య కంపెనీలూ చేపడుతుండటం డ్రాగన్‌ వ్యూహానికి భంగం కలిగించే అవకాశముంది. షాంఘైలో మొన్న జులైలో జరిగిన ప్రపంచ ఏఐ సదస్సులో చైనా అధినేత జిన్‌పింగ్‌ ప్రారంభోపన్యాసం చేశారు. ఏఐ రంగంలో సహకారం, నైతిక పాలనకు రెండు కార్యాచరణ ప్రణాళికలను వెలువరించారు. అంతేకాకుండా, షాంఘై ప్రధాన కార్యాలయంగా సొంత మండలి, సచివాలయాలతో శాశ్వత అంతర్‌ ప్రభుత్వ సంస్థగా వైకో ఆవిర్భవించింది. దీని వ్యవస్థాపక ఒప్పందంపై చైనా, రష్యా, పాకిస్థాన్‌ సహా 29 దేశాలు సంతకాలు చేశాయి. ఏ దేశమైనా ఈ సంస్థలో సభ్యత్వం తీసుకోవచ్చు. సమాన ఓటింగ్‌ హక్కులు, ఏకాభిప్రాయం, లేదా మూడింట రెండొంతుల మెజారిటీ ద్వారా వైకో నిర్ణయాలు తీసుకుంటుంది. ఐక్యరాజ్య సమితి నిబంధనావళికి అనుగుణంగా విస్తృత సంప్రదింపులతో ఉమ్మడి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. ఏఐ అభివృద్ధి అనేది ఏ ఒక్క దేశం గుప్పిట్లోనూ ఉండకూడదని వైకో లక్షిస్తోంది. తదనుగుణంగానే వర్ధమాన దేశాల ఏఐ సామర్థ్యం పెంపు, ప్రపంచస్థాయిలో ఏఐకి సాంకేతిక ప్రమాణాల రూపకల్పన, ఓపెన్‌-సోర్స్‌ ఎకోసిస్టమ్‌ల అభివృద్ధికి ఈ సంస్థ కృషి చేస్తుంది. చైనా దగ్గర అమెరికాకు ఉన్నంత అత్యాధునిక సెమీకండక్టర్లు లేకపోయినా, ఏఐ మోడళ్లకు శిక్షణనిచ్చే డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన అరుదైన ఖనిజాలైతే ఉన్నాయి. బీజింగ్‌ ల్యాబ్‌లు ఓపెన్‌ వెయిట్‌ మోడల్స్‌ను విడుదల చేస్తూ... థర్డ్‌పార్టీ ప్రొవైడర్లు, స్థానిక హోస్ట్‌లు, హగ్గింగ్‌ఫేస్‌ వంటి వేదికలకు పంపిణీ బాధ్యతలను అప్పగిస్తున్నాయి. నిరుడు మొత్తం డౌన్‌లోడ్‌లలో చైనా మోడళ్ల వాటా దాదాపు 41శాతానికి చేరుకుని, అమెరికన్‌ మోడళ్లను అధిగమించింది. షాంఘై సదస్సులో జిన్‌పింగ్‌ పశ్చిమ దేశాలు ఏఐ, సెమీకండక్టర్ల విషయంలో జాతీయ భద్రతను అతిగా ప్రస్తావించడాన్ని విమర్శించారు. ఏఐ మోడళ్లను అన్ని దేశాలకు అందించడానికి పారదర్శకత, సహకారం, సమాన పంపిణీ, మానవ నియంత్రణ ద్వారా భద్రంగా ఉపయోగించడం, ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కేంద్రీకృత సమన్వయం సాధించడం ముఖ్యమని ఉద్ఘాటించారు. వినడానికి ఇది బాగానే ఉందికానీ, చైనా ప్రవచిస్తున్న పారదర్శకత సార్వత్రికం, సార్వజనీనం కాదు. వాస్తవానికి డ్రాగన్‌ పారదర్శకత, స్వేచ్ఛాయుత పంపిణీ పేరిట తన ఏఐ మోడల్స్, ప్రమాణాలను వ్యాపింపజేయాలని చూస్తోందే తప్ప- బేషరతుగా తన మార్కెట్‌నూ, సమాచారాన్నీ ఇతర దేశాలకు అందుబాటులో ఉంచాలనుకోవట్లేదు. పైగా సాంకేతిక ప్రమాణాల నిర్దేశం, సామర్థ్యాల సృష్టి, ఓపెన్‌ సోర్స్‌ ఎకోసిస్టమ్‌ వంటి విభాగాల్లో తనకున్న పట్టును వ్యూహాత్మక ప్రయోజనంగా మలచుకోవాలని చూస్తోంది. ఇక్కడ అమెరికా విదేశాంగశాఖ ముందుకుతెచ్చిన ‘ప్యాక్స్‌ సిలికా’తో వైకోను తులనాత్మకంగా పరిశీలించాల్సి ఉంది. వైకో పలు దేశాలకు స్వేచ్ఛాయుత, అధికారిక సభ్యత్వం, ఉమ్మడిగా ఏఐ సామర్థ్య పెంపు సూత్రాల ద్వారా సర్వామోదాన్ని ఆశిస్తోంది. దీనికి భిన్నంగా ప్యాక్స్‌ సిలికా ఎంపిక చేసిన కొన్ని దేశాల భాగస్వామ్యంతో ముందుకు సాగాలనుకుంటోంది. ఏతావాతా అమెరికా, చైనాల ఏఐ పర్యావరణ వ్యవస్థలైన ప్యాక్స్‌సిలికా, వైకోల మధ్య సమాంతర పోటీ నెలకొంది. వీటిలో చేరదలచిన ఇతర దేశాలు తమ స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాలి, లేదంటే పావులుగా మారే ప్రమాదముంది. మెటా అధినేత జుకర్‌బర్గ్‌ ఇటీవల ఒక మేనిఫెస్టో లేఖతో పాటు మ్యూజ్‌ గ్లిమ్మర్, మ్యూజ్‌ స్పార్క్‌ 1.2 అనే రెండు ఓపెన్‌-వెయిట్‌ మోడళ్లనూ విడుదల చేశారు. శిక్షణ డేటాపై దేశీయ పరిమితుల కారణంగా అమెరికా సంస్థలు ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయనీ, దీనివల్ల చైనా సంస్థలతో సమర్థ పోటీకి ఆటంకం కలుగుతోందని ఆయన వాదించారు. ఓపెన్‌ వెయిట్స్‌పై చైనాకన్నా అమెరికా వెనకబడిపోకుండా ఉండాలంటే, ప్రస్తుత పరిమితులను సడలించాలని ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరారు. మెటా ఆశిస్తున్నది నెరవేరితే ఓపెన్‌ వెయిట్స్‌ మోడళ్లలో చైనా ఆధిక్యానికి పోటీ ఎదురవుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు చైనా నిర్మించిన వైకో ఆకర్షణీయంగా ఉంటుందా, లేదంటే అమెరికా ఏఐ పర్యావరణ వ్యవస్థనా అనేదే అసలు సిసలు ప్రశ్న! .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





