
దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాదంలో అత్యంత కీలక పాత్ర పోషించిన సీనియర్ నాయకురాలు, డివిజన్ కమిటీ సభ్యురాలు నక్కా సుశీల రాణి (అలియాస్ లత/లలిత/రేలా/జ్యోతి) లొంగిపోయారు. నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఎదుట ఆమె మంగళవారం అధికారికంగా లొంగిపోయారు. సుశీల సరెండర్‌తో మావోయిస్టుల పునర్నిర్మాణ సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదని, ఇది రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద పతనానికి ముగింపు దశగా నిలిచిందని పోలీసులు అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక పరిణామంతో 2026 సంవత్సరం తెలంగాణ పోలీసు శాఖ పోరాటంలో ఒక కీలక మలుపుగా మారింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB), గ్రేహౌండ్స్, జిల్లా పోలీసుల సమన్వయంతో సాగించిన వ్యూహాత్మక చర్యల వల్ల ఈ ఏడాది ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో మొత్తం 266 మంది అజ్ఞాత మావోలు హింసామార్గాన్ని వీడి లొంగిపోయారు. ఈ ఏడాది లొంగిపోయిన వారిలో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, 12 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 25 మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు/సభ్యులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరితో పాటు 94 మంది ఏరియా కమిటీ సభ్యులు, 131 మంది సాధారణ మావోయిస్టులు లొంగిపోవడంతో పార్టీ నెట్వర్క్ అగ్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు పూర్తిగా ఛిన్నాభిన్నమైందని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణకు చెంది బయటి రాష్ట్రాల్లో పనిచేస్తున్న ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు (గణపతి), జడె రత్నబాయి (సుజాత), వార్త శేఖర్ (మంగు) అనే ముగ్గురు నేతలు మాత్రమే అజ్ఞాతంలో మిగిలారని పోలీసులు ధ్రువీకరించారు. సుశీల రాణి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీన పడిందని... అజ్ఞాతంలో ఉన్న మిగిలిన వారందరూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాన్ని ఉపయోగించుకుని సాధారణ జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.





