
కరెంటు కోతలతో పొలాల వద్ద రైతుల పడిగాపులు కేటీదొడ్డి: ఇర్కిచేడు సబ్‌స్టేషన్‌ ఎదుట ఆదివారం ఆందోళన చేస్తున్న రైతులు వీరు. విద్యుత్తు సరఫరా సక్రమంగా లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈనాడు, మహబూబ్‌నగర్‌: వినాయకచవితి నాటికి ఏటా పంటలు పచ్చదనంతో కళకళలాడుతుంటాయి.. అన్నదాతలు ఎంతో సంబరంగా గణపతి మండపాల వద్ద భక్తిభావంతో పరవశించేవారు. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక.. రిజర్వాయర్లు నిండక.. విద్యుత్తు కోతలతో అన్నదాతలు సతమతం అవుతున్నారు. ఈ క్రమంలో గణనాథుని మండపాల వద్ద ఉండాల్సిన రైతన్నలు పంటలు కాపాడుకునేందుకు పొలాలకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వానాకాలంలో సాధారణ సాగు అంచనా 21.32 లక్షల ఎకరాలు కాగా.. అధికారుల గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 16.32 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో ఎక్కువగా కాలువలు, బోరుబావుల ఆధారంగా వేసిన ఆయకట్టే ఉంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగా కురవలేదు. ఆశతో అన్నదాతలు వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు కంది, మినుము, పెసర, తదితర ఆరుతడి పంటలు సాగు చేసినా వాటిని కాపాడుకునే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. వర్షాభావ పరిస్థితులతో కాలువల నుంచి ఆశించినంతగా నీరు రాక, విద్యుత్తు కోతలతో సరిపడా నీరందక పంటలు ఎండిపోతున్నాయి. పత్తి రైతులైతే రెండు, మూడు సార్లు విత్తనాలు విత్తుకున్నారు. కౌలురైతులకు కౌలు డబ్బులతో పాటు పెట్టుబడులు భారమవుతున్నాయని అయోమయంలో ఉన్నారు. బోరుబావుల కింద వేసిన పంటలు విద్యుత్తు కోతల వల్ల నీరందడం లేదని అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇటీవల వనపర్తి జిల్లా రాజాపేట, కడుకుంట, నాచహళ్లి, కల్వకుర్తి మండలం తాండ్రగేట్, అక్కడి విద్యుత్తు సబ్‌డివిజన్‌ కార్యాలయం వద్ద, గద్వాల, మక్తల్‌ తదితర ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవ్వాల్సి ఉన్నా.. రెండు, మూడు గంటలు కోత పడుతోందని వాపోతున్నారు. ఉదయం గంటలకు ఇవ్వాల్సింది, 7, 8 గంటల నుంచి ఇస్తున్నారని, కనీసం 5 నుంచి 10 సార్లు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతోందని చెబుతున్నారు. అలాగే లో వోల్టేజీ సరఫరాతో మోటార్లు కాలిపోతున్నాయని వాపోతున్నారు. విద్యుత్తు కోతలు లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. బంగారం కుదువపెట్టి.. - సుభద్రమ్మ, శాంతినగర్‌ ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాం. బంగారం కుదువ పెట్టి పెట్టుబడి పెట్టాం. కానీ పూత రాకపోవడంతో పత్తిని తొలగించి, కంది వేశాం. పూతకు వచ్చే దశలో కాలువలో నీరు రాక, వర్షం పడక అదీ ఎండిపోతోంది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. కోతలతో ఇబ్బందులు - బర్ల ఆనంద్, నాచహళ్లి, వనపర్తి జిల్లా గ్రామంలో బోరు కింద మా అన్నదమ్ములతో కలిసి నాలుగెకరాలు సాగు చేస్తున్నాం. పది రోజులుగా ఉదయం 6 గంటలకు రావాల్సిన కరెంటు 8 గంటలకు వస్తోంది. సాయంత్రం 6 గంటలకు పోతోంది. విద్యుత్తు అంతరాయాల వల్ల పంటకు నీళ్లందడం లేదు. నాకున్న ఎకరంలో అరెకరం నెర్రెలు విచ్చింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





