
అధికారుల కళ్లుగప్పి పశువుల క్రయవిక్రయాలు పండితాపురం సంతలో రాత్రి వేళ విక్రయానికి ఉంచిన పశువులు ఈనాడు-ఖమ్మం: కామేపల్లి, న్యూస్‌టుడే: కామేపల్లి మండలం పండితాపురంలోని శ్రీకృష్ణప్రసాద్‌ పశువుల సంతలో చీకటి దందా కొనసాగుతోంది. ప్రతి బుధవారం నడిచే ఈ సంతకు రాష్ట్ర స్థాయిలో పేరుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు పశువులను తీసుకొచ్చి వ్యాపారం చేస్తుంటారు. 2026-27 ఆర్థిక సంవత్సర వేలంలో హక్కులు పొందిన గుత్తేదారు అక్రమాలకు దారులు తెరిచినట్లు తెలుస్తోంది. సంతలో ప్రతివారం నిత్యావసరాలు, కూరగాయలు, వస్త్రాలు, పశువులు, గొర్రెలు, మేకల వ్యాపారం రూ.లక్షల్లో సాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2.42 కోట్లకు వేలం ఖరారైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాజకీయ ప్రోద్బలంతో గుత్తేదారులు రింగై పాట పెరగకుండా జాగ్రత్తపడ్డారు. మూడు సార్లు వాయిదా పడగా.. గరిష్ఠంగా రూ.2.09 కోట్లకు(గతేడాది కంటే రూ.33 లక్షలకు తక్కువకు) వేలం పాడిన గుత్తేదారుకు హక్కులు కట్టబెట్టారు. ప్రశ్నించే వారిపై బెదిరింపులకు పాల్పడుతూ అక్రమాలు బయటకు రాకుండా చూసుకుంటున్నారు. జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక అధికారులు నిర్వాహకులకు వంతపాడుతున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగాల్సిన క్రయవిక్రయాలు మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహిస్తూ.. కాసులు దండుకుంటున్నారు. పశువైద్యుల నిర్ధారణ లేకుండానే.. రాత్రికిరాత్రే వాహనాల్లో కుక్కి తరలిస్తున్నారు. పశువుల అపహరణలు పెరిగిన నేపథ్యంలో దొంగలకు మంచి అవకాశంగా మారింది. చీకటి దందా కారణంగా ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకుండా వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. వార సంతలో ఆవులు, ఎద్దులు, గేదెల విక్రయం జరిగితే అమ్మిన వారు, కొన్నవారు రూ.250 చొప్పున ఇవ్వాలి. ఇందుకు విరుద్ధంగా ప్రతి పశువుకు ఇద్దరి నుంచి రూ.500 చొప్పున రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. దూడకు రుసుం లేకున్నా.. తీసుకుంటున్నారు. ఎక్కువ వసూళ్లపై ప్రశ్నిస్తే నిర్వాహకులు, వారి అనుచరులు దాడులకు తెగబడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఏపీకి చెందిన ఇద్దరు మాంసం వ్యాపారులు మేకలు కొనుగోలు చేయగా.. ఎక్కువ డబ్బులు వసూలు చేయడం, పిల్ల మేకలకూ రుసుం తీసుకోవడంతో ఘర్షణలు జరిగాయి. పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. మం గళవారం అర్ధరాత్రి వ్యాపారం సాగుతున్నట్లు తెలుసుకొని నిర్వాహకులతో మాట్లాడాం. దూర ప్రాంతాల నుంచి పశువులు ముందురోజు రాత్రి వస్తున్నాయని, బుధవారం ఉదయం బేరాలు సాగుతున్నాయని వారు చెప్పారు. ముందస్తు క్రయవిక్రయాలు సాగించొద్దని వారికి స్పష్టం చేశాం. త్వరలో నోటీసులు ఇస్తాం. శంకర్, పంచాయతీ కార్యదర్శి, కొమ్మినేపల్లి .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





