
ధర్మారం, సెప్టెంబర్ 16 : కాళేశ్వరం లింక్-2 అనుబంధంగా ఉన్న పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్ నుంచి మంగళవారం మొదలైన గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి బరాజ్ నుంచి గ్రావిటీ కాలువ ద్వారా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్‌హౌస్‌లోని సర్జ్పూల్కు నీరు చేరుతుండగా, పంప్‌హౌస్‌లో 3,7వ నంబర్ల మోటర్లను బుధవారం నడిపించారు. ఒక్కో మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున 6,300 క్యూసెక్కులను నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడ రిజర్వాయర్ క్రస్ట్ గేట్ల ద్వారా అదే పరిమాణంలో నీటిని జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిస్తున్నారు. అక్కడ రెండు బాహుబలి పంపులను ఆన్‌చేసి జలాలను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర జలాశయం (మిడ్‌మానేర్)కు తరలిస్తున్నారు. కాగా, రెండు చోట్లా మోటర్లను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో నడుపుతూ జలాలను లిఫ్ట్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.





