
ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో ముందంజలో నిలిచింది. అంతర్జాతీయ డేటా సంస్థ నంబియో తాజా సర్వే ప్రకారం.. భారత్‌లోని ప్రముఖ నగరాల్లో హైదరాబాద్ అత్యుత్తమ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్కోరును సాధించింది. ఐటీ హబ్‌గా పేరున్న బెంగళూరు, దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైని వెనక్కి నెట్టి 171.09 స్కోరుతో భాగ్యనగరం అగ్రస్థానంలో నిలిచింది.హైదరాబాద్ జీవన ప్రమాణాల్లో ముందుండటానికి ప్రధాన కారణాల్లో జీవన వ్యయం అందుబాటులో ఉండటం ఒకటిగా సర్వే విశ్లేషణలో తేలింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలు, రోజువారీ అవసరాల ఖర్చులు కొంత తక్కువగా ఉంటాయి. దీంతో ఉద్యోగులు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఇతర అవసరాలు, పొదుపు, జీవనశైలికి వినియోగించుకునే అవకాశం ఉంటుందని సర్వే వెల్లడైంది. ఆదాయానికి వస్తువులు-సేవల ధరలకు మధ్య ఉన్న సమతుల్యత హైదరాబాద్ ప్రజలకు అధిక కొనుగోలు శక్తిని కల్పిస్తోందని రిపోర్టులో చెప్పారు.సొంత ఇల్లు, ఫ్లాట్ కొనుగోలు విషయంలోనూ హైదరాబాద్ ఇతర మెట్రో నగరాల కంటే కొంత అనుకూలంగా ఉందని నివేదిక పేర్కొంటోంది. ఆదాయంతో పోలిస్తే ఇళ్ల ధరల నిష్పత్తి తక్కువగా ఉండటం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేసుకునే అవకాశం మెరుగ్గా ఉందన్నారు. వైద్య సేవలు కూడా హైదరాబాద్ నగరాన్ని టాప్ ప్లేస్‌లో నిలిపాయి. నగరంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, స్పెషలిస్టు డాక్టర్లు, అధునాతన చికిత్సా సదుపాయాలు వివిధ వర్గాల ప్రజలకు వైద్య భరోసాను అందిస్తున్నాయన్నారు. ఐటీ, ఫార్మా, వైద్య రంగాల విస్తరణతో నగరంలో ఉద్యోగ, ఆర్థిక అవకాశాలు కూడా పెరిగాయని చెప్పారు.క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే కేవలం అధిక ఆదాయం మాత్రమే కాదని నంబియో రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఒక నగరంలో ప్రజలు ఎంత సురక్షితంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా, సౌకర్యవంతంగా జీవించగలుగుతున్నారనే అంశాలను కలిపి జీవన ప్రమాణాలను అంచనా వేశారు. నంబియో రేటింగ్‌లో హైదరాబాద్ 171.09 స్కోరుతో అగ్రస్థానంలో ఉండగా.. బెంగళూరు 126.03, ఢిల్లీ 87.53, ముంబై 86.56 స్కోర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ జీవన వ్యయం, మౌలిక సదుపాయాలు, వైద్య సేవలు, కొనుగోలు శక్తి వంటి అంశాల్లో సమతుల్యత కొనసాగించడం హైదరాబాద్‌కు కలిసొచ్చినట్లు ఈ ర్యాంకింగ్ సూచిస్తోంది.





