
హైదరాబాద్, సెప్టెంబర్ 14: అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులపై నీరు చేరే పరిస్థితులు ఏర్పడ్డాయి. వచ్చే 24 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.. హైదరాబాద్లో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, హైడ్రా, విద్యుత్, పోలీస్, రెవెన్యూ తదితర లైన్ డిపార్ట్మెంట్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిపై సమీక్షించారు. వర్షాల కారణంగా నగరంలో ఎక్కడా నీరు నిలిచిపోకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని లైన్ డిపార్ట్మెంట్లు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.





