
అక్రమాలకు పాల్పడిన కేసీఆర్, కుటుంబ సభ్యులు, బినామీలు మాజీ సీఎం ఫామ్‌హౌస్‌ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని అక్కడ డప్పు కొట్టిన ప్రతి దళితుడికి అరెకరం చొప్పున పంచుతా శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ఈనాడు, హైదరాబాద్‌: భారాస హయాంలో భారీగా భూదోపిడీ జరిగిందని.. కేసీఆర్, ఆయన కుటుంబంతోపాటు బినామీలు, భారాస నేతలు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభలో ఆరోపించారు. వ్యవసాయ సీలింగ్‌ చట్టానికి విరుద్ధంగా కేసీఆర్‌ కుటుంబానికి అధిక విస్తీర్ణంలో భూములున్నాయంటూ వాటి వివరాలను సభలో వెల్లడించారు. ‘ఒక కుటుంబం తెలంగాణ ఉద్యమాన్ని, ధరణిని అడ్డం పెట్టుకొని ఏవిధంగా సంపాదించిందో నా వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు చెబుతున్నా.కేసీఆర్‌ బినామీ బోయినపల్లి శ్రీనివాసరావులాంటి వాళ్ల గురించి మరోసారి చెబుతా’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సభ ముందుంచారు. ‘సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలంలో కేసీఆర్‌కు చెందిన ఫామ్‌హౌస్‌ ఉన్న ఎర్రవల్లి గ్రామంలో 1944 సర్వే ప్రకారం 2,747 ఎకరాలు భూమి ఉంది. ఎర్రవల్లికి, దానిని ఆనుకొని ఉన్న షేరివెంకటాపూర్‌కు మధ్య 300 ఎకరాల ఓవర్‌లాపింగ్‌ భూమి ఉండేది. ఇలా 1957 నుంచి రెండు గ్రామాల మధ్య వివాదంలో ఉన్న భూమిని 2017లో భూక్రమబద్ధీకరణలో భాగంగా కొనుక్కొని కేసీఆర్‌ యజమాని అయ్యారు. ప్రస్తుతం ఫామ్‌హౌస్‌ మొత్తం 295 ఎకరాల్లో ఉంది. ఇక్కడో మతలబు ఉంది. ప్రస్తుతం ఫామ్‌హౌస్‌ ఉన్న ప్రాంతంలో సర్వే నంబరు 325లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. భారాస అధికారంలో ఉన్నప్పుడు 2017లో ల్యాండ్‌ రికార్డ్స్‌ అప్‌డేషన్‌లో చాలా మార్పులు జరిగాయి. రికార్డులో ఉన్న 295 ఎకరాలతోపాటు 388 ఎకరాల రికార్డుల్లో లేని భూమి కలిపి దాదాపు 700 ఎకరాలు కేసీఆర్‌ అధీనంలో ఉందో లేదో చెప్పాలి. నేను ఇక్కడి నుంచే కలెక్టర్‌కు ఆదేశాలిస్తున్నా. తక్షణమే కేసీఆర్‌కు నోటీస్‌ ఇచ్చి ఆయన కొనుగోలు చేసిందెంత..? అక్కడ అందుబాటులో ఉన్న భూమి ఎంత..? అక్కడ ప్రభుత్వానికి ఉండాల్సిన 388 ఎకరాల భూమి ఎవరి అధీనంలో ఉందో తేల్చాలని చెబుతున్నా. ఆ భూమిని తీసుకొని ఇటీవల ఫామ్‌హౌస్‌ ఎదుట డప్పు కొట్టిన ప్రతి దళితుడికి అరెకరం చొప్పున 800 కుటుంబాలకు పట్టాల రూపంలో పంచుతా. కేటీఆర్‌ జన్వాడ ఫామ్‌హౌస్‌ సత్యం కుంభకోణానికి సంబంధించిన భూముల్లో ఉంది. జన్వాడలో సర్వే నంబరు 311లో శతబిష అనే కంపెనీ పేరు మీద ఉండి ఆదాయపన్నుశాఖ జప్తు చేసిన భూమి కేటీఆర్‌ భార్య శైలిమ, అత్త పాకాల శశిరేఖ పేరు మీదికి బదిలీ అయింది. అందులోనే ఫామ్‌హౌస్‌ వచ్చింది. 2019లో ధరణి కాంట్రాక్టును కట్టబెడితే ఈ భూములు రామలింగరాజు కంపెనీల నుంచి కేటీఆర్‌కు బదిలీ అయ్యాయి. ఆ ఫామ్‌హౌస్‌కు అనుమతి లేదు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఫిరంగి కాల్వను ఎలా ఆక్రమించుకున్నారో తర్వాత చెబుతా. రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మించేటప్పుడే భూసేకరణ కోసం నాలుగు గ్రామాల్లో 2,212 ఎకరాల 12 గుంటల భూమిని నోటిఫై చేశారు. అందులో కొంత భూమిని హరీశ్‌రావు కొన్న తర్వాత డీనోటిఫై చేశారు. రామంచలో సర్వే నంబరు 464లో 4ఎకరాల 20 గుంటలు సేకరించాలని ప్రతిపాదించి తుది నోటిఫికేషన్‌లో 1 ఎకరం 29 గుంటలుగా మార్చారు. దీనితోపాటు ఇతర భూములు కలిపి మొత్తం 14 ఎకరాలను హరీశ్‌రావు కొన్నారు. భూసేకరణకు ప్రభుత్వం రైతులకు రూ.6.25 లక్షల చొప్పున ఇచ్చింది. కానీ హరీశ్‌రావు మాత్రం రూ.2.5 లక్షలకే ఎకరం చొప్పున కొనుగోలు చేశారు. ప్రభుత్వం పరిహారం కింద ఎక్కువ సొమ్ము ఇచ్చినప్పుడు హరీశ్‌రావుకు రైతులు ఎందుకు తక్కువకు అమ్ముతారు..? ఆయన బెదిరించి భూములను కొన్నారా.. లేక నల్లధనం వినియోగించి ఈడీ కేసులో ఇరుక్కుంటారా.. హరీశ్‌రావు చెప్పాలి. అంతేకాకుండా మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేని రంగనాయకసాగర్‌ ప్రాజెక్టుకు రూ.5.33 కోట్లతో బీటీ రోడ్డు వేయించుకున్నారు. ఇరిగేషన్‌శాఖ సేకరించిన భూమిని సుడాకు ఎలా బదలాయిస్తారు..? .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





