
డబ్ల్యూఏపీఎల్‌ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా నారా బ్రాహ్మణి విలేకర్లతో మాట్లాడుతున్న కేశినేని శివనాథ్‌. చిత్రంలో కల్యాణ్‌కృష్ణ, జైకిషన్‌ ఈనాడు, అమరావతి: మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తేవాలనే లక్ష్యంతో ఏసీఏ ఆధ్వర్యంలో డబ్ల్యూఏపీఎల్‌ నిర్వహణకు సర్వంసిద్ధమైంది. మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 27 వరకూ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లు జరుగుతాయని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ తెలిపారు. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి హాజరవుతారన్నారు. విద్యార్థినులు మ్యాచ్‌లు వీక్షించేందుకు విజయవాడ, గుంటూరు, మంగళగిరి నుంచి ఏసీఏ ఆధ్వర్యంలో ఉచితంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామన్నారు. ప్రతిరోజూ జరిగే మ్యాచ్‌లకు మహిళా న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, ఉన్నతాధికారుల్ని అతిథులుగా ఆహ్వానించనున్నట్లు వివరించారు. తొలిసారి ఫ్రాంచైజీ విధానంలో నిర్వహిస్తున్న లీగ్‌లో ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ సహా ప్రతిష్ఠాత్మక సంస్థలు జట్లను సొంతం చేసుకున్నాయన్నారు. విజయవాడలోని ఏసీఏ కార్యాలయంలో డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ కల్యాణ్‌కృష్ణ, సీఏవో జైకిషన్‌లతో కలిసి శివనాథ్‌ బుధవారం విలేకర్లతో మాట్లాడారు. జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారమవుతాయన్నారు. నేడు మహిళలతో బైక్‌ ర్యాలీ: డబ్ల్యూఏపీఎల్‌కు ప్రచారం కల్పించడంలో భాగంగా విజయవాడలోని నోవోటెల్‌ నుంచి మంగళగిరి ఏసీఏ స్టేడియం వరకూ మహిళలతో గురువారం బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు శివనాథ్‌ తెలిపారు. ‘రాబోయే డబ్ల్యూఏపీఎల్‌ మ్యాచ్‌ల్ని ఏపీఎల్‌కు దీటుగా విశాఖపట్నం, కడపల్లో నిర్వహిస్తాం’ అని శివనాథ్‌ తెలిపారు. ఆసియాకప్‌ టీ20లో భారత మహిళల జట్టును విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించిన శ్రీచరణిని శివనాథ్‌ అభినందించారు. యువక్రికెటర్లకు ప్రేరణ కల్పించడానికి శ్రీచరణితో చిట్‌చాట్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




