
సీఈఏ మాస్టర్‌ ప్లాన్‌లో అంచనా డిమాండ్‌ అంచనాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల విద్యుత్‌ అధికారుల సమావేశం ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 2036-37 నాటికి విద్యుత్‌ వినియోగం 1.74 లక్షల మిలియన్‌ యూనిట్లకు (ఎంయూ) చేరుతుందని కేంద్ర విద్యుత్‌ సంస్థ (సీఈఏ) అంచనా వేసింది. 2025-26లో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 79,971 ఎంయూలుగా ఉంది. ఈ లెక్కన రాబోయే 11 ఏళ్లలో సుమారు లక్ష ఎంయూల విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని సీఈఏ భావిస్తోంది. అందుకు అనుగుణంగా సరఫరా, పంపిణీ వ్యవస్థలు సమకూర్చుకోవాలని నిర్దేశించింది. సంవత్సరం వారీగా విద్యుత్‌ డిమాండ్‌ ఎంత ఉండబోతోంది? ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులు ఎంత? ఇంకా ఎంత సమకూర్చుకోవాలనే మాస్టర్‌ప్లాన్‌ను సీఈఏ అందించింది. అందుకు అనుగుణంగా వనరులు సమకూర్చుకోవడంపై కార్యాచరణ చేపట్టాలని విద్యుత్‌ అధికారులకు సూచించింది. దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో వచ్చే విద్యుత్‌ డిమాండ్‌పై అంచనా వేసేందుకు విద్యుత్‌ సంస్థల అధికారులతో విజయవాడలో బుధవారం జరిగిన సమావేశానికి సీఈఏ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రాలవారీగా భ¡విష్యత్తు విద్యుత్‌ డిమాండ్‌ అంచనాలకు అనుగుణంగా ‘సరిపడా విద్యుత్‌ లభ్యత’ కోసం సీఈఏ సూచనలు చేసింది. రాష్ట్రానికి సంబంధించి సీఈఏ ఇచ్చిన విద్యుత్‌ డిమాండ్‌ అంచనాలపై అధికారులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. వాటి వివరాలు రాష్ట్ర విద్యుత్‌ అధికారులు పంపితే.. మాస్టర్‌ప్లాన్‌ సవరించి పంపేందుకు సీఈఏ అంగీకరించింది. వచ్చే ఏడాది డిమాండ్‌ 18,800 మెగావాట్లు వి శాఖపట్నంలో డేటాసెంటర్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టమ్‌ ప్రాజెక్టులు, గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టులకు 2027-28 నుంచే విద్యుత్‌ డిమాండ్‌ అంచనాల్లో సీఈఏ చేర్చింది. కొన్ని పీఎస్‌పీ ప్రాజెక్టులూ అందుబాటులోకి వస్తాయని.. వాటన్నింటికీ కలిపి విద్యుత్‌ డిమాండ్‌ 18,800 మెగావాట్లకు చేరుతుందని సీఈఏ పేర్కొంది. ఈ అంచనాలపై విద్యుత్‌ అధికారులు అభ్యంతరం తెలిపారు. ‘డేటాసెంటర్లు 2027-28 నాటికి అందుబాటులోకి వస్తాయి. వాటికి రాష్ట్ర నెట్‌వర్క్‌ నుంచి 1,500 మెగావాట్ల విద్యుత్తే సరఫరా అవుతుంది. పీఎస్‌పీ ప్రాజెక్టులు 2029-30 నాటికి అందుబాటులోకి వస్తాయి. వాటికి అవసరమయ్యే విద్యుత్‌నూ వచ్చే ఆర్థిక సంవత్సరం డిమాండ్‌లో కలిపి చూపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పాటయ్యే గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్‌ సెంట్రల్‌ ట్రాన్స్‌మిషన్‌ యూనిట్‌ ద్వారా తీసుకుంటాయి. వాటికి అవసరమైన విద్యుత్‌నూ డిమాండ్‌లో కలిపి చూపడంతో ఆ విద్యుత్‌ మొత్తం మిగిలిపోతుంది. ఈ దృష్ట్యా సీఈఏ డిమాండ్‌ అంచనాలు సవరించాలి’ అని అధికారులు ప్రతిపాదించారు. సీఈఏ డిమాండ్‌ అంచనాలకు అనుగుణంగా వనరులను విద్యుత్‌ సంస్థలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పగటి వేళల్లో మిగులు విద్యుత్‌ ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిమాండ్‌ 15,800 మెగావాట్లుగా సీఈఏ చూపింది. అందుకు అనుగుణంగా ప్రస్తుత డిమాండ్‌ 15వేల మెగావాట్ల వరకు ఉంటోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





