
సీబీఐసీ ఛైర్మన్‌ వివేక్‌ చతుర్వేది దిల్లీ: విశ్వసనీయ పన్ను చెల్లింపుదార్లతో నేరుగా కలవడాన్ని తగ్గించడానికి.. కస్టమ్స్‌ విభాగం కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్, రియల్‌-టైమ్‌ అనలిటిక్స్‌ వినియోగాన్ని వేగవంతం చేయాలని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల మండలి (సీబీఐసీ) ఛైర్మన్‌ వివేక్‌ చతుర్వేది సూచించారు. వచ్చే దశాబ్దంలో కస్టమ్స్‌ విభాగం అనుసరించాల్సిన 5 మూల స్తంభాలను వివరిస్తూ, జీఎస్‌టీ, కస్టమ్స్, ఇతర పరోక్ష పన్నుల చెల్లింపుల్లో వ్యాపారాలు నిలకడగా నిబంధనలు పాటిస్తున్నట్లు నమోదు చేసే ఏకీకృత, విశ్వసనీయ చెల్లింపుదార్ల వ్యవస్థను సృష్టించాలని సీబీఐసీ యోచిస్తోందని చతుర్వేది పేర్కొన్నారు. ఇది పరోక్ష పన్నుల విభాగం అంతటా సమన్వయాన్ని తీసుకొస్తుందన్నారు. ఎలిజిబుల్‌ మాన్యుఫ్యాక్చరర్‌ ఇంపోర్టర్‌ (ఈఎంఐ), ఆథరైజ్డ్‌ ఎకనామిక్‌ ఆపరేటర్‌ (ఏఈఓ) వంటి కస్టమ్స్‌ వాయిదా సుంకం చెల్లింపు పథకాల ప్రయోజనాలను చిన్న వ్యాపారాలు పొందగలిగేలా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ)కు చేయూతనివ్వాలని, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని కస్టమ్స్‌ విభాగాన్ని సీబీఐసీ చీఫ్‌ కోరారు. కస్టమ్స్‌కు సాంకేతికత ఒక గొప్ప సాధనంగా పని చేయాలని, ఏఈఓలుగా నమోదైన వ్యాపారాలకు దాదాపు స్పర్శరహిత, కాగిత రహిత అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఉండాలని చతుర్వేది సూచించారు. ప్రస్తుతం దిగుమతిదార్లు, ఎగుమతిదార్లు, లాజిస్టిక్స్‌ ప్రొవైడర్లు, కస్టోడియన్లు, టెర్మినల్‌ ఆపరేటర్లు, కస్టమ్‌ బ్రోకర్లు, వేర్‌హౌస్‌ ఆపరేటర్లతో పాటు ఏఈఓ సర్టిఫికెట్లు కలిగిన 6,000కు పైగా సంస్థలు ఉన్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




