
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గోపి కాళ్లపై గాయాలున్న చిత్రాలను చూపుతున్న మంద కృష్ణ మాదిగ తుళ్లూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన దళిత యువకుడు చీకటి గోపి పోలీసుల అక్రమ నిర్బంధం, చిత్రహింసల కారణంగానే మృతి చెందాడని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. తుళ్లూరులో ఆయన ఎమ్మార్పీఎస్‌ నాయకులు, గోపి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘అరెస్టు చేసిన నిందితులను 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలి. 60 గంటల పాటు పోలీస్‌ స్టేషన్‌లో గోపిని అక్రమ నిర్బంధం చేయడం చట్టవిరుద్ధం కాదా? స్టేషన్‌ నుంచి గాయాలతో కుంటుతూ బయటకు వచ్చాడు. అతడి కాళ్లపై, ఒళ్లంతా గాయాలున్నాయి చూడండి’ అంటూ గాయాల ఫొటోలను మీడియాకు చూపారు. ‘ఈ అంశంలో సీఎం చంద్రబాబు స్పందించి.. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారితో సిట్‌ ఏర్పాటు చేసి, గోపి కేసును దర్యాప్తు చేయించాలి. మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమిచ్చి, రూ.25 లక్షల పరిహారం అందించాలి’ అని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతాం’ అని పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





