
ఇల్లు, ఆఫీస్, హోటల్, రెస్టారెంట్.. ఇలా ఎక్కడ చూసినా ఇప్పుడు టిష్యూ పేపర్ల వాడకం కామన్ అయిపోయింది. కఅయితే ఎప్పుడైనా ఈ టిష్యూలు ఎప్పుడూ తెల్లగానే ఎందుకుంటాయని ఆలోచించారా? ఇది కేవలం లుక్ కోసం కాదు.
ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణం.. ఇలా దీని వెనుక చాలా కారణాలున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా తెల్లటి టిష్యూలనే ఎక్కువగా వాడతారు.
తెలుపు రంగును సాధారణంగా శుభ్రత, పరిశుభ్రతకు చిహ్నంగా చూస్తాం. టిష్యూ పేపర్లను ముఖం, చేతులు తుడుచుకోవడానికి, కొన్నిసార్లు ఆహారం కోసం కూడా వాడతాం. అందుకే తెలుపు రంగులో ఉంటే అవి శుభ్రంగా, సురక్షితంగా ఉన్నాయని ప్రజలు నమ్ముతారు.
రంగుల టిష్యూ పేపర్లలో డైస్, రసాయనాలు వాడతారు. కొంతమందికి చర్మం చాలా సున్నితంగా (సెన్సిటివ్) ఉంటుంది. అలాంటి వాళ్లకు ఈ రంగుల వల్ల అలర్జీలు లేదా చికాకు కలగవచ్చు. అదే రంగులు లేని తెల్లటి టిష్యూ అయితే చర్మానికి చాలా సురక్షితం.
ముఖం, చర్మంపై వాడే వస్తువుల్లో రసాయనాలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. తెల్లటి టిష్యూ పేపర్లకు రంగులు వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి, వీటి వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
టిష్యూ పేపర్లను నీటిలో వేయగానే త్వరగా కరిగిపోయేలా డిజైన్ చేస్తారు. తెల్లటి టిష్యూలలో సాధారణంగా రంగులు, హానికరమైన రసాయనాలు ఉండవు. కాబట్టి వీటిని పారేయడం (డిస్పోజ్ చేయడం) చాలా సులభం.
రంగుల టిష్యూలలో రకరకాల రసాయనాలు ఉంటాయి. అదే తెల్లటి టిష్యూలలో తక్కువ కెమికల్స్ వాడతారు. దీనివల్ల పర్యావరణానికి హాని తక్కువగా ఉంటుంది. వీటిని డిస్పోజ్ చేయడం కూడా చాలా సులభం.
టిష్యూ పేపర్లను భారీ మొత్తంలో తయారు చేస్తారు. వీటికి రకరకాల రంగులు, డిజైన్లు జోడిస్తే ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. కానీ తెల్లటి టిష్యూలను తయారు చేయడానికి అయ్యే ఖర్చు తక్కువ. అందుకే కంపెనీలకు, వినియోగదారులకు కూడా ఇదే లాభదాయకం.