
భారత్ వంటి అధిక జనాభా గల దేశంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందినవారే ఎక్కువ మంది ఉంటారు. వీరిలో కొంతమంది మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో ఎంతో చురుగ్గా ఉంటే, మిగతా వారిలో ఎక్కువ మంది
సంప్రదాయ ఆర్థిక అలవాట్లతో వెనుకబడి ఉంటున్నారు. బయటకు వీరు బాగానే ఉన్నట్లు కన్పించినా వీరి ఖర్చులు, మదుపు అలవాట్లు జీవితంలో వీరిని ఆర్థికంగా ఎదగనివ్వవు. వీరిలో చాలా మంది కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారు, స్నేహితుల ద్వారా కొన్ని నియమాలు పాటిస్తు, ఆర్థిక పరమైన విషయాల్లో అనేక తప్పులు చేస్తుంటారు. ఖర్చులు, మదుపు వంటి విషయాల్లో వారి సంప్రదాయ ఆలోచనలు చాలా వరకు నేటి వృద్ధి అవకాశాలకు సరిపడవు. అయినప్పటికీ, అవి సురక్షితంగా, సామాజికంగా ఆమోదయోగ్యంగా అనిపించడం వల్ల వాటిని అనుసరిస్తూనే ఉంటారు. సహజంగా చాలా మంది చేసే తప్పులు, వాటిని ఎలా అధిగమిస్తే ఆర్థికంగా బాగుంటుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
చాలా మంది తమ పొదుపును..బ్యాంకు సేవింగ్స్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్లతో ఆరంభిస్తారు. అయితే, 6–7% వాస్తవ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు 6–7% రాబడినిచ్చే FDలు వాస్తవానికి మీ పెట్టుబడిని పెంచలేవు/నెమ్మదింపజేస్తాయి. ఇందులో రాబడి కేవలం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అటు ఇటుగా మాత్రమే ఉంటుంది. ఈ ఆధునిక కాలంలో సంపదను నిర్మించుకోవాలంటే, భద్రత, అభివృద్ధి అనే రెండింటి కలయిక అవసరం. కాబట్టి, రిస్క్ చేసే వయసుగలవారు పెట్టుబడుల పంథాను పూర్తిగా మార్చుకుని ఇతర పెట్టుబడులను పరిశీలించాలి.
కొంత మంది ప్రణాళిక లేకుండా అధిక వడ్డీకి తీసుకునే రుణాలు వారి నెలవారీ ఆదాయాన్ని మింగేస్తుంటాయి. ఈ కారణంగా చాలా మంది రుణాలంటే ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా బాధపడిపోతారు. అయితే, ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించనక్కర్లేదు. కొన్ని బాధ్యాతాయుతమైన రుణాలు చాలా మంది జీవితాల్లో పెనుమార్పులు తీసుకుని వస్తాయి. ఈ రోజుల్లో, రుణం తీసుకోవడం ప్రతికూల అంశంగా భావించకూడదు. ఎందుకంటే..ఇంటి రుణం, విద్యా రుణం, వ్యాపార రుణం తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలుంటాయి. ఇవన్నీ జీవితంలో ఆర్థికంగా స్థిరపడడానికి ఉపయోగపడేవే అని చెప్పొచ్చు. సాధారణంగా మీరు రుణం తీసుకోవాలా వద్దా అనే దానికంటే, తీసుకునే రుణం..మంచిదా/చెడ్డదా అనే ఆలోచన ఉండడం కీలకం. బాధ్యతాయుతమైన వ్యక్తులు కొన్ని అవసరాలకు రుణం తీసుకోవడం తప్పుకాదు.
శతాబ్దాలుగా..బంగారం భద్రతకు, స్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. బంగారం మిమ్మల్ని ద్రవ్యోల్బణం నుంచి కాపాడి, ఆర్థిక సంక్షోభ సమయాల్లో తన విలువను కాపాడుకుంటుంది. కాలక్రమేణా స్థిరమైన రాబడిని అందిస్తుంది. లిక్విడిటీ కూడా ఎక్కువే. ఇలాంటి బలమైన కారణాల వల్ల బంగారం ఒక్కటే సరైన పెట్టుబడి అని చాలామంది నమ్ముతుంటారు. అలాగని, ఆభరణాల రూపంలో భౌతిక బంగారంపై పెట్టుబడి పెడితే లాభసాటి కాదు. వీటికి తయారీ ఛార్జీలు, ఇంటిలో భద్రతపరమైన సవాళ్లు అనేకం ఉంటాయి. బంగారం ఒక విలువైన ఆస్తిగా ఉపయోగపడడం వాస్తవమే. అయితే, ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లు వంటి వైవిధ్యభరితమైన పెట్టుబడుల దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యంతో బంగారం పోటీపడలేదు. బంగారం ఒక విలువైన పెట్టుబడే. కానీ, దీన్ని ఏకైక పెట్టుబడి వ్యూహంగా కాకుండా, ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికలో భాగంగా ఉపయోగించడం ఉత్తమం.
చాలామంది స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు భావోద్వేగ నిర్ణయాల వల్ల స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి, నష్టపోతుంటారు. కానీ, ఇలా అందరూ నష్టపోవాలని లేదు. స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు, ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా, కొంత కాలం పాటు సమాచార సేకరణతో స్థిరమైన పెట్టుబడి విధానాన్ని అలవర్చుకోవాలి. దీర్ఘకాలంలో, SIPలతో పాటు, వ్యూహాత్మకంగా సరైన సమయంలో చేసే ఏకమొత్తాల పెట్టుబడులు..పెట్టుబడిదారుడి సంపదను పెంచడానికి సహాయపడతాయి.
చాలా మంది ఎండోమెంట్ ప్లాన్లు, మనీ-బ్యాక్ పాలసీలు, హోల్ లైఫ్ పాలసీలు వంటి అనేక సంప్రదాయ భీమా పథకాలను సురక్షితమైన పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తారు. కానీ, ఇలాంటి పథకాల ద్వారా వచ్చే రాబడి చాలా తక్కువగా, అంటే సంవత్సరానికి 4-5% మధ్యలో మాత్రమే ఉంటుంది. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడమే బీమా ప్రధాన ఉద్దేశం కాగా, అది కూడా ఇందులో నెరవేరదు. బీమాతో పెట్టుబడిని కలిపి ఉంచినప్పుడు, మీకు సరైన ఆర్థిక రక్షణ లభించదు, సగటు కంటే తక్కువ రాబడి వస్తుంది. బీమా కోసం టర్మ్ పాలసీ ఎంతో మేలు. ప్రీమియం తక్కువ ఉంటుంది, ఆర్థిక రక్షణ(బీమా హామీ) ఎక్కువ ఉంటుంది. దీర్ఘకాల పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్లలో సిప్ ఎంచుకోవచ్చు.
ఖర్చుల విషయంలో ఎక్కువ నియంత్రణ పాటించి ఎక్కువ పొదుపు చేయాలని పెద్దలు చెబుతుంటారు. సంపద సృష్టికి కొంత స్వీయ-నియంత్రణ అవసరమైనప్పటికీ, కేవలం ఖర్చుల నియంత్రణ ద్వారా మాత్రమే ఎక్కువ పొదుపు చేయలేము. ఎవరైనా ఖర్చులను ఒక పరిమితి వరకు మాత్రమే తగ్గించుకోగలరు, మితిమీరి తగ్గించుకోలేరు. పొదుపు పెంచడానికి ఖర్చులపై మరీ ఎక్కువ ఆదా చేసే బదులు, మీ ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టడం మేలు. తెలివిగా ఖర్చు చేయడం, ఆదాయాన్ని పెంచుకోవడం, నిలకడగా పెట్టుబడి పెట్టడం.. ఇలాంటి సమతుల్య విధానం ఎల్లప్పుడూ మెరుగైన ఆర్థిక ఫలితాలను ఇస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.