
కాలచక్రంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకవైపు జప, తపాది ఆధ్యాత్మిక సాధనలకు, మరోవైపు ఆకాశంలో జరిగే అద్భుతమైన ఖగోళ మార్పులకు ఈ మాసం వేదిక.
పౌర్ణమి నాడు చంద్రుడు ‘పూర్వాషాఢ’ లేదా ‘ఉత్తరాషాఢ’ నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. వర్ష రుతువుకు నాంది పలికే ఈ కాలంలో ఆకాశంలో గ్రహాల కదలికలు భూమిపై వాతావరణాన్ని, అలాగే మానవ జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం!
జులై 29న వచ్చే వ్యాస పూర్ణిమ (Guru purnima 2026 date) కేవలం ఆధ్యాత్మిక పర్వదినం మాత్రమే కాదు, ఖగోళ అద్భుతం. ఆధ్యాత్మికంగా చూస్తే, వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, అష్టాదశ పురాణాలను అందించిన వేదవ్యాసుని ఆరాధించే రోజుగా ఈ రోజును జరుపుకొంటాము. పరివ్రాజకులు చాతుర్మాస్య దీక్షను (chaturmas 2026 start date) ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు. ఖగోళ శాస్త్ర పరంగా, ఈ సంవత్సరం గురుపూర్ణిమ నాడు గురువు ఉచ్ఛ రాశిలో ఉండడం విశేషం. జ్యోతిష పరంగా, రవి-గురు గ్రహ సంయోగం అంటే సంపూర్ణ మౌఢ్యమి స్థితి. ఈ సమయంలో చేసే జప, ధ్యానాలకు విశేషమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. గురు ధ్యానం చేయడం, గురువులకు నమస్కరించడం, వ్యాస పూజ మొదలైనవి శ్రేయస్సునిస్తాయి.
ఈ మాసంలో ఖగోళపరంగా జరిగే అతి పెద్ద ఘట్టం దక్షిణాయన (dakshinayana 2026) ప్రారంభం. జులై 17వ తేదీన ఉదయం 11:04 గంటలకు సూర్య భగవానుడు నిరయణ రాశి చక్రంలో పునర్వసు నక్షత్రం 4వ పాదంతో పాటు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే ‘కర్కాటక సంక్రమణం’ అంటారు. ఉత్తరం వైపుగా ప్రయాణించే సూర్యుడు, ఈ రోజు నుంచి తన దిశను మార్చుకుని దక్షిణ దిశగా ప్రయాణించడం ప్రారంభిస్తాడు. సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా ప్రయాణించే ఈ ఆరు నెలల కాలాన్ని ‘దక్షిణాయనం’ అంటారు. శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగలు కాగా, దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం. అందువల్ల ఈ కాలంలో పితృ దేవతల ఆరాధన, వ్రతాలు, దానధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.
ఈ మాసంలో ఆకాశంలో జరిగే గ్రహాల కదలికలు సమాజంపై, వాతావరణంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతాయి. జులై 3న సూర్యుడు.. ఆర్ద్ర-4లోకి ప్రవేశించడం వల్ల వాతావరణంలో మార్పులు సంభవించి వర్షాలు కురుస్తాయి. జులై 4న శుక్రుడు.. రవి క్షేత్రమైన సింహ రాశిలోకి, కుజుడు.. రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల రాజకీయాల్లో కీలక నిర్ణయాలు, ప్రజల్లో ఉత్సాహం పెరుగుతాయి. 6న భూమి సూర్యునికి అత్యంత దూరంగా చేరుకుంటుంది. ఈ ఖగోళ ఘట్టాన్ని జ్యోతిష శాస్త్ర పరంగా విశ్లేషిస్తే, సూర్య కిరణాల తీవ్రత భూమిపై స్వల్పంగా తగ్గడం వల్ల వాతావరణంలోనూ, మానవ జీవనంలోనూ స్పష్టమైన మార్పులు చోటుచేసుకుంటాయి.
సూర్యుని ఉష్ణ ప్రభావం తగ్గడం వల్ల జీవరాశుల శరీరంలో వేడి శాంతించి, దేహంలో కఫ, వాత దోషాల ప్రభావం (తేమ, చల్లదనం) పెరుగుతుంది. మానసికంగా రజోగుణం సన్నగిల్లి, ఆలోచనలు ప్రశాంతంగా, అంతర్ముఖంగా మారుతాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.