
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Nitin Nabin Telangana Tour: 'ప్రధానమంత్రి మోదీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ. కాంగ్రెస్ గ్యారంటీ అంటే ఎప్పటికీ నెరవేరని హామీ అనే విషయం దేశ ప్రజలకు బాగా అర్థమైంది' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జతిన్ నబిన్ విమర్శించారు. 'దేశంలో ఏయే రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయో అక్కడ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. మేము శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేసి ప్రారంభించే బాధ్యతను కూడా మా ప్రభుత్వాలే నిర్వర్తించాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం ప్రజలకు అమలుకు నోచుకోని హామీలు ఇచ్చింది. ఇప్పటిదాకా అమలు చేయలేదు' అని తెలిపారు.
భవిష్యత్తు ఎంతో ఉజ్వలం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య ప్రసంగం చేశారు. 'తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతోంది. రానున్న కాలం తెలంగాణలో బీజేపీదేననే విశ్వాసం నాకు మరింత బలపడింది' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిన అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించాలనే సంకల్పాన్ని ఈ కార్యవర్గ సమావేశం ద్వారా మనమంతా చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. '1980లో స్థాపించిన బీజేపీ తన తొలి లోక్‌సభ ఎన్నికల్లో కేవలం ఇద్దరు ఎంపీలను మాత్రమే గెలిపించుకోగలిగింది. ఆ పార్టీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది. ఈ ఘనత పూర్తిగా బూత్ స్థాయి వరకు నిరంతరం శ్రమిస్తూ కమలాన్ని వికసింపజేసిన ప్రతి కార్యకర్తదే' అని ప్రకటించారు.
ముగ్గురు మహనీయుల ఆశయాలు 'డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్, అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ ముగ్గురు మహనీయుల ఆశయాలను ప్రధాని మోదీ కార్యరూపంలో ముందుకు తీసుకెళ్తున్నారు. 12 సంవత్సరాల్లో మోదీ నాయకత్వంలో అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తికి చేరేలా చేసిన సంకల్పం విజయవంతమైంది. ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ అనే భావనను సాకారం చేశారు' అని నితిన్ నబిన్ తెలిపారు. 'మనం సాధించిన విజయాలతోనే సంతృప్తి చెందే పరిస్థితి లేదు. ఇంకా ఎన్నో సవాళ్లు మన ముందున్నాయి. విజయం సాధించామని భావించి మన గమ్యాన్ని చేరుకున్నామని అనుకోవడం సరికాదు. ఇంకా ఎంతో పోరాటం చేయాల్సి ఉంది' అని పార్టీ శ్రేణులకు జాతీయ అధ్యక్షుడు సూచించారు.
భాగస్వాములు కావాలి '2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయాలంటే.. ఈ తరానికి చెందిన ప్రతి కార్యకర్త తన సంపూర్ణ శక్తి సామర్థ్యాలను వినియోగించాలి. అంకితభావం, సంకల్పం, నిరంతర కృషితో ముందుకు సాగి అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి' అని నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. '2014కు ముందు దేశం నిరాశలో, అవినీతిలో కూరుకుపోయింది. యువత తమ భవిష్యత్తు, దేశ భవిష్యత్తుపై ఆందోళన చెందేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రధానమంత్రి సమర్థ నాయకత్వంపై దేశ ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది' అని పేర్కొన్నారు.
'పశ్చిమ బెంగాల్ విజయం సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. అక్కడ మా కార్యకర్తలు ఎన్నో హింసలు, వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయలేదు. పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. ఆ అచంచల సంకల్పమే నేడు పశ్చిమ బెంగాల్లో కమలం వికసించడానికి కారణమైంది' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ వివరించారు. 'దేశ మహిళల గౌరవం, ప్రజల ఆత్మగౌరవం గురించి ఆలోచించే మనస్తత్వం కాంగ్రెస్‌కు లేదు. వారికి అధికారం మాత్రమే ముఖ్యం. అదే కారణంగా ప్రజలు వారిని వరుసగా తిరస్కరిస్తూ అధికారానికి దూరం చేస్తున్నారు' అని విమర్శించారు.
సిద్ధం కావాలి 'తెలంగాణలో ప్రజాసమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతికి వ్యతిరేకంగా మనమంతా ప్రజల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడేందుకు సిద్ధం కావాలి. తెలంగాణలో మార్పు తీసుకురావాలంటే, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలవాలంటే వారి సమస్యలతో మమేకం కావాలి. ప్రజల సమస్యలపై పూర్తి శక్తితో ఉద్యమించాలి' అని బీజేపీ నాయకత్వానికి నితిన్ నబిన్ సూచించారు. పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై ఐక్యంగా.. అంకితభావంతో పోరాటం చేస్తే 2028లో తెలంగాణలో విజయం బీజేపీదేననే పూర్తి విశ్వాసం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
'తెలంగాణ అనేది ప్రారంభం నుంచే కమలం వికసించిన రాష్ట్రం. నేడు దేశంలోని 22 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ప్రజాసేవ చేస్తున్నాయంటే.. ప్రధానమంత్రి సమర్థ నాయకత్వమే కారణం. దేశ ప్రజలు ఆ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు' అని నితిన్ నబిన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలనే ఎన్నికల అజెండాగా చేసుకోమని.. మోదీ హయాంలో దేశంలో తీసుకొచ్చిన అభివృద్ధి, మార్పు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలనే ప్రజల ముందుకు తీసుకెళ్తాం అని వివరించారు.
తెలంగాణకు కేంద్రం చేసింది ఇదే 'తెలంగాణ అభివృద్ధికి కూడా ఎన్డీయే ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలోని 30 లక్షలకు పైగా రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 33 లక్షలకు పైగా రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా సులభ రుణాలను పొందుతున్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు పసుపు సాగు చేసే రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలను కల్పించే దిశగా కీలక అడుగుగా నిలిచింది. తెలంగాణలో 83 లక్షలకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ చేశాం. పేదల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్రంలో 1.32 కోట్లకు పైగా జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ప్రారంభించాం' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు వివరించారు.