
సోషల్ మీడియా పిచ్చితో ఆకతాయి యువకులు రెచ్చిపోతున్నారు. ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలన్న కోరికతో చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా వేగంగా వెళ్తున్న ఆటోలో ఓ యువకుడు హంగామా చేయగా..
అది ఓ వృద్ధుడి ప్రాణాల మీదకు తెచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా పిచ్చితో ఆకతాయి యువకులు రెచ్చిపోతున్నారు. ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలన్న కోరికతో చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. వివిధ రకాల విన్యాసాలు చేస్తూ తాము ఇబ్బందులు పడటమే కాకుండా ఇతరుల ప్రాణాల మీదకూ తెస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటోలో ఓ యువకుడు హంగామా సృష్టించగా.. అది ఓ వృద్ధుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బైకర్ డాష్‌క్యామ్‌లో రికార్డు అవగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వీడియో ప్రకారం.. ఓ బ్రిడ్జ్‌పై ఉన్న రహదారిపై వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. రోడ్డుకి ఇరువైపులా అనేక మంది వాహనాలను ఆపి మరీ అక్కడి అందాలను తిలకిస్తున్నారు. ఇందులో మహిళలు, యువతులు, యువకులు, చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఆ మార్గంలోకి ఆకతాయిల ఆటో ఒకేసారి వేగంగా దూసుకొచ్చింది. డ్రైవర్ ఆటోను రోడ్డుకు అటు, ఇటు తిప్పుతుండగా.. ఓ యువకుడు ఆటోకి బయట వైపు వేలాడుతూ హంగామా చేస్తున్నాడు. అక్కడ ఉన్న యువతులను ఆకర్షించేందుకు కేకలు వేస్తూ చేతులు గట్టిగా ఊపుతూ డ్యాన్స్ చేస్తున్నాడు. ఇదంతా మరో యువకుడు ఆటో లోపలి నుంచి వీడియో తీస్తున్నాడు. ఇంతలో సైకిల్‌పై తన దారిన తాను వెళ్తున్న వృద్ధుడిని ఆటో బయట నిలుచున్న యువకుడు బలంగా ఢీకొట్టాడు. దీంతో సదరు వృద్ధుడు అక్కడికక్కడే కిందపడిపోయాడు.
ఆటో డ్రైవర్ మాత్రం తమ వాహనాన్ని ఆపకుండానే ఉడాయించాడు. ఇది గమనించిన స్థానికులు బాధితుడిని రక్షించేందుకు అతని వద్దకు వెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఓ బైకర్ డాష్‌క్యామ్‌లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో నెట్టింట షేర్ అవగా.. ఆకతాయి యువకులపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ ఘటనను చాలామంది నెటిజన్లు 'హిట్ అండ్ రన్'గా అభివర్ణించారు. అలాగే నిందితులను పట్టుకోవాలని, వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకెవరూ రద్దీ రోడ్లపై ఇలాంటి చర్యలకు పాల్పడకుండా నిరోధించాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.
విరిగిపడిన కొండచరియ.. తృటిలో తప్పించుకున్న బైకర్
ఒడ్డుకు కొట్టుకొచ్చిన 26 అడుగుల తిమింగలం పిల్ల.. చివరికి..