
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Govt Employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి తీపి కబురు వినిపించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగులకు సంబంధించిన బిల్లుల బకాయిల చెల్లింపు విడతల వారీగా కొనసాగుతోంది. తాజాగా ఆ ప్రక్రియను ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేయాలని ప్రయత్నాలు చేస్తుండగా.. తాజాగా సోమవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉద్యోగులకు సంబంధించి రూ.2 వేల కోట్ల నిధులను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ నిధులు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమ పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగ జేఏసీ నాయకులు భారీ కార్యాచరణ చేపట్టి.. సమ్మెకు వెళ్లేందుకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఉద్యోగులతో ప్రభుత్వం సంప్రదింపులు చేసి.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వంద రోజుల్లో రూ.6,000 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నెల 29న మొదటి విడతగా రూ.2 వేల కోట్లను విడుదల చేయగా.. ఈసారి రెండో విడతలో మరో రూ.2 వేల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ప్రభుత్వ మాజీ ఉద్యోగులు దినదిన గండంగా బతుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) బకాయిలను వంద శాతం చెల్లించి.. వారి ఖాతాలను పూర్తిగా క్లియర్ చేసింది.
ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో ఎలాంటి పెండింగ్‌లు లేవని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని ప్రకటించుకుంది. పెండింగ్‌లో ఉన్న రూ.10,000 లోపు విలువ కలిగిన చిన్న మొత్తాల బిల్లులన్నింటినీ ఇప్పటికే ప్రభుత్వం పరిష్కరించింది. ఈ విభాగంలో దాదాపు 5 లక్షలకు పైగా ఉన్న టోకెన్లను గుర్తించి ఏమాత్రం ఆలస్యం లేకుండా చెల్లింపులు జరగడం గమనార్హం. కాగా ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము కష్టాల్లో ఉన్న సమయంలో పెండింగ్ బిల్లుల విడుదల చేయడం ఆనందాన్నిస్తోందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్పారు. రాబోయే రోజుల్లో మిగిలిన బకాయిలను కూడా క్రమపద్ధతిలో క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించడంతో ఉద్యోగులు ఆనందంలో మునిగారు.