అమెరికా సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పుతో అధ్యక్షుడి అధికారాలను భారీగా విస్తరించింది. స్వతంత్ర ఫెడరల్ ఏజెన్సీల అధిపతులను తొలగించే విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను అమెరికా...
అమెరికా సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పుతో అధ్యక్షుడి అధికారాలను భారీగా విస్తరించింది. స్వతంత్ర ఫెడరల్ ఏజెన్సీల అధిపతులను తొలగించే విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను అమెరికా సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే, ఈ అధికారాల నుంచి 'ఫెడరల్ రిజర్వ్' (Fed) కు మాత్రం ఒక ముఖ్యమైన మినహాయింపు ఇచ్చింది. తనపై వచ్చిన మార్గగీజ్ (ఇంటి రుణం) మోసం ఆరోపణలను ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లిసా కుక్ తోసిపుచ్చారు. ట్రంప్ తనను పదవి నుంచి తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాలపై ఆమె చట్టపరంగా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆమె తన పదవిలో కొనసాగేందుకు న్యాయమూర్తులు అనుమతించారు.అయితే, వడ్డీ రేట్లను నిర్ణయించే కేంద్ర బ్యాంక్ (ఫెడరల్ రిజర్వ్) విషయంలో మినహా, మిగిలిన అన్ని ఫెడరల్ ఏజెన్సీల అధిపతులను తమకు నచ్చినప్పుడు తొలగించే పూర్తి స్వేచ్ఛ అధ్యక్షుడికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి తొలగింపులకు బలమైన కారణం ఉండాలని పేర్కొనే ఫెడరల్ చట్టాలను, అలాగే అధ్యక్షుడి కార్యనిర్వాహక అధికారాలను పరిమితం చేస్తూ 91 ఏళ్ల క్రితం ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పును పక్కనబెడుతూ కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.తొమ్మిది మంది సభ్యులున్న సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఆరుగురు కన్జర్వేటివ్ (రిపబ్లికన్ మద్దతుదారులు) న్యాయమూర్తులు మెజారిటీతో ఈ తీర్పునిచ్చారు. రాజకీయ ప్రభావం లేని స్వతంత్ర నిర్ణయాల కోసం గతంలో 'హంఫ్రీస్ ఎగ్జిక్యూటర్' కేసులో ఏజెన్సీల బోర్డు సభ్యుల తొలగింపుపై విధించిన పరిమితులను, నాటి ఏకగ్రీవ తీర్పును ప్రస్తుత ధర్మాసనం ఈ సందర్భంగా రద్దు చేసింది.‘‘పదవి నుంచి తొలగించకుండా ఇలాంటి రక్షణ కల్పించడం అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాల విభజన సిద్ధాంతానికి విరుద్ధమని మేము భావిస్తున్నాం’’ అని అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ తరపున రాసిన తీర్పులో పేర్కొన్నారు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ మాజీ సభ్యురాలు రెబెక్కా స్లాటర్ కేసులో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. చట్టం ప్రకారం తొలగింపునకు బలమైన కారణం ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ, ట్రంప్ ఆమెను ఎటువంటి కారణం లేకుండానే పదవి నుంచి తొలగించారు. ఈ తీర్పు నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్, మెరిట్ సిస్టమ్స్ ప్రొటెక్షన్ బోర్డ్, కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ వంటి ఇతర ఏజెన్సీలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఈ సంస్థల బోర్డు సభ్యులను కూడాగతంలో పదవుల నుంచి ట్రంప్ తొలగించారు.సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యం 'ట్రూత్ సోషల్'లో స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘అధ్యక్షుడి అధికారాలకు సంబంధించి ఇప్పటివరకు వెలువడిన అత్యంత ముఖ్యమైన తీర్పులలో ఒకటైన ఈ చారిత్రాత్మక, అపూర్వమైన తీర్పును, నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సాధించడం నాకు దక్కిన గొప్ప గౌరవం’’ అని ఆయన పేర్కొన్నారు.