
బూర్గంపహాడ్, జూన్ 29 : పాఠశాలకు విద్యార్థులు గైర్హాజరు కాకుండా వంద శాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి అన్నారు.
సోమవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ కస్తూర్భా గాంధీ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ఫేస్ రికగ్నేషన్ యాప్ (ఎస్ఆర్ఎస్)లో పరిశీలించి నలుగురు ఉపాధ్యాయులు గైర్హాజరు కావడాన్ని గుర్తించి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. రికార్డులను పరిశీలించి పాఠశాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. కొత్తగా వచ్చిన అడ్మిషన్లు పరిశీలించి ఎన్రోల్మెంట్ను ఇంకా పెంచాలన్నారు. పాఠశాలలో విద్యార్థులకు సంబంధించి వంట సామాగ్రి, సరుకులు, వంటగది, బాత్రూమ్స్ పరిశీలించి పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించిన ఆమె విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించి ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి వాటిని ఉపయోగించుకుంటూ విద్యా నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకోవాలన్నారు. పాఠశాలకు ఎట్టి పరిస్థితుల్లో గైర్హాజరు కాకుండా సక్రమంగా హాజరుకావాలన్నారు. వారం రోజుల్లో పాఠశాలను తిరిగి సందర్శిస్తానని, ఆ సమయానికి ఎవరూ గైర్హాజరు కాకుండా విద్యార్థులు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చూడాలని హెచ్చరించారు. ఆమె వెంట జిల్లా ప్లానింగ్ కో-ఆర్డినేటర్ ఎన్.సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.