
మస్తిష్కం సవాళ్లను ఇష్టపడుతుంది... శోధించి, సాధించమంటుంది... అప్పుడే అది ఆరోగ్యంగా ఉంటుంది. దానికోసం మనమేం చేయాలంటే...
సవాళ్లతో కూడిన పనిలో పాల్గొంటే మన మెదడులో ‘కాగ్నిటివ్ రిజర్వ్’ అనే సామర్థ్యం పెరుగుతుంది. ఇది మెదడు ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది. శారీరకంగా, సామాజికంగా, మానసికంగా కొన్ని పనులు చేస్తుంటే మెదడు పది కాలాలపాటు శక్తిమంతంగా ఉంటుందని స్కాట్లాండ్లోని హెరియట్-వాట్ యూనివర్సిటీ మనస్తత్వవేత్త అలన్ గౌ అంటున్నారు. దీనికోసం...
ప్రదేశాల్ని గుర్తుంచుకోవడం: వయసుతో పాటే మతిమరుపు వస్తుంటుంది. దాన్నుంచి రక్షించుకునే ఓ వ్యూహం మెదడులోని ఓ నిర్దిష్ట భాగాన్ని లక్ష్యంగా చేసుకోవడం. ప్రాదేశిక మార్గనిర్దేశానికి మెదడులో ముఖ్యమైన ప్రాంతం హిప్పోక్యాంపస్. అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు కనిపించడానికి చాలా సంవత్సరాల ముందే ప్రభావితమయ్యే మొదటి భాగం ఇదని నిపుణులు చెబుతారు. అల్జీమర్స్ ఉన్నవారు తరచుగా దారి తప్పిపోవడం ప్రారంభ లక్షణంగా ఉంటుంది. మొట్టమొదట దీన్ని గుర్తించడం చాలా ముఖ్యమని బ్రిటన్ యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డెన్నిస్ చాన్ అంటున్నారు. అల్జీమర్స్‌ను నివారించడం లేదా ఆలస్యం చేయడానికి హిప్పోక్యాంపస్‌ను రక్షించడం కీలకమని చాన్ చెబుతున్నారు. లక్ష్యసాధనపై దృష్టిపెట్టే క్రీడలు, పిల్లలు బిల్డింగ్ బ్లాక్‌లతో ఆడుకోవడం వంటి పనుల ద్వారా ప్రాదేశిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చనని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అలాగే కొన్ని నెలల పాటు ప్రాదేశిక నావిగేషన్(ఫోన్‌ను వాడకుండా దిక్కుల్ని కనుక్కోవడం)పై దృష్టిపెట్టినా నైపుణ్యం మెరుగవుతుదంటున్నారు.
సామాజిక చురుకుదనం: సామాజికంగా చురుగ్గా ఉండడం మనల్ని జ్ఞాన క్షీణత నుంచి కాపాడుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఉదాహరణకు అధిక సామాజిక భాగస్వామ్యం ఉన్న శతాధిక వృద్ధులకు మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మధ్య వయసులో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం వృద్ధాప్యంలో జ్ఞాపక సామర్థ్యానికి తోడ్పడుతుంది. ఇలాంటి వారికి వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చే ముప్పు 30-50% తక్కువగా ఉందని, లేదా ఆ లక్షణాన్ని ఆలస్యం చేయొచ్చని అధ్యయనంలో తేలింది. బ్రిటన్‌లో 1,923 మంది వృద్ధులపై జరిపిన అధ్యయనంలో.. అత్యంత చురుకుగా ఉన్నవారి కంటే తక్కువగా ఉన్నవారికి ఐదేళ్ల ముందే డిమెన్షియా వచ్చినట్లు తేలింది.
జీవితకాల అభ్యాసం: వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్య సూచిక ఒక వ్యక్తి విద్యాభ్యాసంలో ఎన్ని సంవత్సరాలు గడిపాడు అనేది. జీవితాంతం అభ్యసన మెదడుకు ఆరోగ్య రక్షణ ఇస్తుందని, మతిమరుపు ప్రమాదాన్ని నివారిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు ఎల్లపుడూ సవాళ్లు, కొత్తదనాన్ని ఇష్టపడుతుంది. దానివల్ల వృద్ధాప్యానికి అత్యంత సున్నితంగా ఉండే మెదడు ప్రాంతాలు బలపడతాయి. మెదడును చురుకుగా ఉంచినప్పుడు, అది మేధోపరమైన క్షీణతను నెమ్మదింపజేస్తుంది. దీనికో ముఖ్య కారణం.. నేర్చుకోవడం అనేది కొత్త న్యూరాన్లను సృష్టించడంతో పాటు ఇప్పటికే ఉన్నవాటిని బలపరుస్తుంది. ఇది వృద్ధాప్యం, కణాల మరణం నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇదే న్యూరోప్లాస్టిసిటీ ఆచరణ రూపం, అంటే మన జీవితకాలంలో మెదడు తనను తాను మార్చుకునే, లేదా అనుగుణంగా మారే సామర్థ్యం.
ఇతర వృత్తులతో పోలిస్తే అంబులెన్స్, టాక్సీ డ్రైవర్లకు అల్జీమర్స్ తక్కువగా వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ డ్రైవర్లు తమ మెదడును ‘ప్రదేశాల్ని గుర్తించడం’ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారని పరిశోధకులు చెబుతున్నారు.
మనం ఇతరులతో సంభాషించినప్పుడు భాష, జ్ఞాపకశక్తి, భవిష్యత్ ప్రణాళికల వంటి మెదడులోని అనేక భాగాల్ని ఉపయోగిస్తాం. ఇందులో మానసికంగా ఉత్తేజపరిచే ఓ మేధోపరమైన అంశం ఉంది కాబట్టి అది మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది’’
పమేలా అల్మెయిడా-మెజా (లండన్‌లోని కింగ్స్ కాలేజ్ ఎపిడెమియాలజిస్ట్)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.