
బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ కేవలం 1 పరుగు తేడాతో భారత్‌పై గెలిచి సరికొత్త...
బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ కేవలం 1 పరుగు తేడాతో భారత్‌పై గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను ఐర్లాండ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా వరుసగా 16 టీ20 సిరీస్‌ల అజేయ రికార్డుకు ఐరిష్ జట్టు బ్రేక్ వేసింది.
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ చరిత్రాత్మక మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోవడానికి గల అసలు ఐదు కారణాలు ఇప్పుడు చూద్దాం.
భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఛేజింగ్ ప్రారంభించిన మొదటి ఓవర్లోనే టీమిండియా ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరూ ఐర్లాండ్ బౌలర్ జై ముండ్రా వేసిన మొదటి ఓవర్లోనే గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యారు. ఈ షాక్ నుంచి టీమిండియా చివరి వరకు కోలుకోలేకపోయింది. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో రన్ రేట్ పూర్తిగా పడిపోయింది.
టాప్ ఆర్డర్ కూలిపోయిన సమయంలో ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ రోస్ అడైర్ విసిరిన డైరెక్ట్ హిట్‌కు ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ వికెట్ పడటంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను కూడా జై ముండ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ పూర్తిగా డిఫెన్స్‌లో పడింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్వయంగా ఒప్పుకున్నట్లుగా, బెల్ఫాస్ట్ పిచ్ ఎలా స్పందిస్తుందో అంచనా వేయడంలో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. సింగిల్స్‌ను డబుల్స్‌గా మార్చడంలో వెనుకబడ్డారు. తిలక్ వర్మ ఒక ఎండ్‌లో ఒంటరి పోరాటం చేస్తూ 46 బంతుల్లో 55 పరుగులు చేసినప్పటికీ, అది భారత్‌కు అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీగా నమోదైంది. పిచ్ స్లోగా ఉండటంతో భారత బ్యాటర్లు బౌండరీలు కొట్టడానికి బాగా ఇబ్బంది పడ్డారు. భారత్ తన ఇన్నింగ్స్‌లో మొదటి సిక్సర్ కొట్టడానికి ఏకంగా 17.1 ఓవర్లు పట్టిందంటే బ్యాటింగ్ ఎంత జిడ్డుగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
ఐర్లాండ్ బౌలర్ జై ముండ్రా అద్భుతమైన స్పెల్‌తో భారత బ్యాటింగ్ వెన్నెముక విరిచాడు. అతను 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుత ప్రదర్శనకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి. మరోవైపు మాథ్యూ హోలార్డ్ కూడా 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
ముఖ్యంగా హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించేలా కనిపించిన తిలక్ వర్మను 18వ ఓవర్లో అవుట్ చేసి ఐర్లాండ్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. అలాగే అక్షర్ పటేల్, శివం దూబే లను కీలక సమయాల్లో అవుట్ చేసి ఐరిష్ బౌలర్లు మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు.
చివరి 2 ఓవర్లలో భారత్ విజయానికి 35 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్లో హర్షిత్ రాణా ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి ఆశలు రేకెత్తించాడు. చివరి ఓవర్లో 20 పరుగులు కావాల్సి ఉండగా హ్యారీ టెక్టర్ బౌలింగ్‌కు వచ్చాడు. హర్షిత్ రాణా ఫోర్, నో బాల్‌తో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. చివరి 3 బంతుల్లో 10 పరుగులు కావాల్సిన దశలో, హ్యారీ టెక్టర్ వేసిన ఫుల్ టాస్ బాల్‌ను లాంగ్ ఆన్ మీదుగా కొట్టబోయి హర్షిత్ రాణా (21 పరుగులు) క్యాచ్ అవుట్ అయ్యాడు. చివరి బంతికి ప్రిన్స్ యాదవ్ సిక్స్ కొట్టినప్పటికీ, భారత్ ఒక పరుగు తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.