
Rythu Bharosa : రైతు భరోసా పథకంపై మరో కీలక అప్డేట్ వచ్చింది. వానాకాలం, యాసంగి సాగులో రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం వానాకాలం సాగుకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.
ఈనెల 30వ తేదీన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం చింతకాని మండలంలోని మత్కేపల్లి గ్రామం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభా వేదిక నుంచి సీఎం రేవంత్ రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఒక్కో రైతు బ్యాంక్ ఖాతాల్లో రూ.6వేలు జమ కానున్నాయి. రైతు భరోసా పథకం కోసం ఇప్పటికే రూ.9వేల కోట్ల నిధుల సమీకరణ పూర్తయినట్లు సమాచారం.
రైతు భరోసా పథకంలో కొత్త రైతులు చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకంలో నమోదు చేసుకోని రైతులు, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి తమ పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 15వ తేదీ వరకు పట్టదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు జులై 5వ తేదీ వరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు.. రైతు భరోసా పథకం నగదు తమ బ్యాంక్ ఖాతాల్లో జమకాని అర్హులైన రైతులు.. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.
ఈనెల 30వ తేదీన ఒక ఎకరం వరకు భూ విస్తీర్ణం కలిగిఉన్న పట్టదారు రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున చెల్లించాలంటే రూ.900కోట్ల నిధులు అవసరం అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ రెండు ఎకరాల వరకు నగదు బదిలీ చేయాలంటే రూ.2,400 కోట్లు అవసరం అవుతాయని చెబుతున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒకే విడతలో మూడు ఎకరాలు కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఎకరం ఎకరం పెంచుకుంటూపోతూ పది ఎకరాలు కలిగిన రైతుల వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇలా ఎనిమిది, తొమ్మిది రోజుల్లో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా పథకంకు సంబంధించి నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం నిధులను సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి రేవంత్ సర్కార్ రైతు భరోసా నగదు ఏ విధంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందో చూడాల్సిందే.