
ఎల్ నీనో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలో సోమవారం వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతము నుండి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరోక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో మరో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, పిడుగులతో ఈదురుగాలుల హెచ్చరిక చేసింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.
కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
మంగళవారం (30-06-2026) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. నాగర్‌కర్నూలు, రంగారెడ్డి జిల్లా, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. హైదరాబాద్, ఆదిలాబాద్, హనుమకొండ, జగిత్యాల..జనగామ, కామారెడ్డి, కరీంనగర్ జిల్లా, కొమురంభీం, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతోపాటు.. ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..