ఆంధ్రప్రదేశ్లోని ఈ పురాతన ఆలయం ఎంతో ప్రసిద్ధి అంటున్నారు టీడీపీ నేత రాజేష్ మహాసేన. ఆలయం మానసిక ప్రశాంతతకి నిలయం.. ఒక ఆధ్యాత్మిక భావనకి నెలవు అంటున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పి గన్నవరం నియోజకర్గం అప్పనపల్లి బాల బాలాజీ ఆలయం గురించి రాజేష్ పోస్ట్ పెట్టారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఆకలితో ఉండరని.. ఉదయం నుంచి రాత్రి వరకూ అద్భుతమైన క్వాలిటీతో నిత్యం అన్నదానం జరిగే మొట్ట మొదటి ఆలయంగా చరిత్ర పుటల్లో నిలిచిందన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడి ఏర్పాట్లు చూసి తిరుమలలో నిత్యాన్నదానం ప్రారంభించారని అని స్థానిక పెద్దలు, పురోహితులు తనతో చెప్పారని రాజేష్ మహాసేన చెప్పుకొచ్చారు. దూర ప్రాంత భక్తులకు వసతి ఏర్పాట్లు ఉన్నాయని.. ఆలయాల నిర్వహణ ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఆశ్చర్య పోయానన్నారు. మానవసేవే మాధవ సేవ అనే నీతికి మించిన భక్తిలేదు అనిపించిందన్నారు. అక్కడి అర్చకులు, ఆ ప్రాంత వాసుల ప్రేమాభిమానాలు మర్చిపోలేను అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవాలయం ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయాన్ని కోనసీమ రెండవ తిరుపతి, బాల తిరుపతి అని పిలుస్తారు. ఈ బాలాజీ ఆలయం పవిత్ర వైనాతేయ నది (గోదావరి ఉపనది) తీరాన కొలువై ఉంది. ఈ ఆలయం మూడు వైపులా గోదావరి నది ఉంటుంది.. మరోవైపు బంగాళాఖాతం ఉంటుంది.. చుట్టూ కొబ్బరి తోటల మధ్య ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. అప్పనపల్లి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి బాల రూపంలో (బాల బాలాజీ) స్వయంభూవుగా వెలిశారని భక్తుల నమ్మకం. 1967లో ఆలయం ప్రారంభమైంది. కొబ్బరికాయల వ్యాపారి మొల్లెట్టి రామస్వామి తిరుమల వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడు.. ఆయన ద్వారా ఈ ఆలయ విస్తరణ ప్రారంభమైంది. ఒకరోజు వేంకటేశ్వర స్వామి రామస్వామి కలలో కనిపించి, తాను అప్పనపల్లిలో బాల బాలాజీగా అవతరిస్తానని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత రామస్వామికి తన కొబ్బరితోటల్లో బాలబాలాజీ ప్రతిమ దర్శనమిచ్చారని చెబుతున్నారు. అలా బాల బాలాజీ ప్రతిమ దర్శనమిచ్చిన చోటే నిత్యపూజలు చేయడం ప్రారంభించారు.. అలా ఇక్కడ ఆలయం అభివృద్ధ చెందింది. ఆలయ వ్యవస్థాపకుడైన శ్రీ మొల్లెట్టి రామస్వామి భక్తుల ఆకలి తీర్చడమే పరమావధిగా ఈ గొప్ప సేవకు శ్రీకారం చుట్టారు. తిరుమలలో నిత్యాన్నదాన పథకం 1985లో ప్రారంభం కాగా.. అప్పనపల్లి క్షేత్రంలో అంతకంటే ముందే అంటే 1977 నుంచే ప్రతిరోజూ నిత్య అన్నదానం కొనసాగుతోంది. అప్పనపల్లిలో నిరంతరాయంగా ఉచిత అన్నదానం ఎలా జరుగుతుందో తెలుసుకుని ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయి అక్కడి అన్నదాన నిర్వహణ తీరును అధ్యయనం చేయడానికి టీటీడీ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని అప్పనపల్లికి పంపించారు. ఆ తర్వాత 1985లో తిరుమలలో అన్నప్రసాద వితరణ మొదలైందని చెబుతుంటారు.