
అందరికీ క్షేమం చేకూరాలి. ఇంటింటా ఆనందం వెల్లివిరియాలి. వర్షాలు హర్షాతిరేకంగా కురవాలి. జలనిధులతో పుడమి పులకించాలి. పచ్చదనంతో నేల మెరవాలి. కర్షకుల జీవితాలు కొత్త కాంతులతో కళకళలాడాలి...
అనే శుభాకాంక్షలకు ప్రతిరూపం ఏరువాక పున్నమి! రైతులు ఈ రోజు నుంచే వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి సిద్ధం చేసిన నాగలి. వాక అంటే దుక్కి దున్నడం. నాగలితో దుక్కి దున్ని తమ కృషికి తగిన ఫలితం రావాలని ప్రకృతిని, పరమాత్మను వ్యవసాయదారులు వేడుకునే సందర్భమే ఏరువాక పున్నమి. జ్యేష్ఠ పౌర్ణమిని కృషి పౌర్ణమి, కర్షక పున్నమి అని వ్యవహరిస్తారు. ప్రతి పనినీ యజ్ఞంగా భావించే సంస్కృతి మనది. వేదవిదులకు మంత్రసాధన యజ్ఞం. గోపాలకులకు గోసేవ చేయడమే యజ్ఞం. రైతులకు వ్యవసాయమే యజ్ఞం. అందుకే ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞంగా అభివర్ణించారు. సీత అంటే నాగేటి చాలు. అందులో చల్లిన విత్తనాలు అంకురించి, మొలకలై, మొక్కలై పంటలు సమృద్ధిగా పండాలని రైతులు అభిలషిస్తారు. ఏరువాక పున్నమిని వృషభోత్సవంగా, మంగళోత్సవంగా అధర్వవేదం అభివర్ణించింది. దీన్ని కర్ణాటకలో కారుణి పబ్బంగా, ఉత్తర భారతంలో కృషి ఉత్సవ్‌గా, హల్ దివస్‌గా పేర్కొంటారు.
ఏరువాక పున్నమి గ్రామానికే వేడుక. ఊరి పొలిమేరల్లో గోగునారతో చేసిన తోరణాలు కడతారు. ఏరువాక బంధాలుగా పిలిచే ఈ తోరణాలను ఆ తర్వాత తమ ఇంటి సింహద్వారాలకు కట్టి సస్య లక్ష్మికి స్వాగతం పలుకుతారు. సాగులో సాయం చేసే ఎద్దుల కాళ్లకు గజ్జెలు కట్టి, మెడలో గంటల్ని, పూలదండలను అలంకరిస్తారు. మంగళ వాద్యాలతో రైతులంతా వాటితో పొలాలకు సంబరంగా తరలి వెళ్లి, దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. అలాగే పొలంలో నవధాన్యాలు చల్లి, కొత్త కుండలో నీరు నింపి, ఆ నీటిలో పసుపు కుంకుమలు, వేపాకులు, చేలోని మట్టి, గోమయం వేసి ఆ జలాన్ని పొలమంతా చల్లుతారు. వరుణుడి అనుగ్రహంతో సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు. దీన్ని తొలకరి వేడుకగా వ్యవహరిస్తారు.
హాలుడు రాసిన గాథాసప్తశతిలో ఏరువాక గురించి ఎన్నో కథలున్నాయి. కపిలవస్తు నగరంలో శుద్ధోధన మహారాజు ఏరువాకను లాంఛనంగా ప్రారంభిస్తూ, బంగారు నాగలితో దుక్కిదున్నాడని బౌద్ధ జాతక కథలు వెల్లడించాయి. శ్రీకృష్ణ దేవరాయలు ఏరువాక ఆరంభం సందర్భంగా రైతులను సత్కరించి వారికి వ్యవసాయ పరికరాలను అందించే సంప్రదాయాన్ని ఏర్పరిచాడని రాయవాచకం పేర్కొంది. కాకతీయుల కాలంలో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ విజయోత్సవాలు జరుపుకొనే వారని జాయపసేనాని నృత్య రత్నావళి వెల్లడించింది. రైతులు ఎంతో శ్రమించి, పంటలు పండించాక నిర్వహించుకునే పండుగ సంక్రాంతి. ఆ సిరుల సంక్రాంతి సౌభాగ్యం ఇంటింటికి తరలి రావాలన్న ఆకాంక్షకు ఆరంభమే ఏరువాక! అందరి ఆకలి బాధలను తీర్చే అన్నదాత, తన కర్తవ్య దీక్షలో పునరంకితమయ్యే సంకల్ప కరదీపిక... ఏరువాక!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.