
అదొక పేరుగాంచిన పారిశ్రామిక సంస్థ. సైన్యానికి సేవలందిస్తున్న ఆ కంపెనీ, దేశ రక్షణలో తన వంతు పాత్ర పోషిస్తోంది. ఒకరోజు ఆ సంస్థ జనరల్ మేనేజర్‌కి పై అధికారుల నుంచి అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది.
సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా సైన్యానికి అవసరమైన ఉపకరణాల ఉత్పత్తిని మరింత వేగవంతం చేయాలని, ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆయన వెంటనే ఉద్యోగులందరినీ సమావేశపరిచారు. చేతిలో ఉన్న పని గురించి వివరించి, ఇకపై అందరూ వేళకు రావాలి... అవసరమైతే అదనపు సమయం పనిచేసైనా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి... ఇది కేవలం కంపెనీ పని కాదు, దేశ భద్రతకు సంబంధించిన బాధ్యత... అని గంభీరంగా చెప్పారు.
కానీ ఉద్యోగుల ముఖాల్లో ఆశించిన ఉత్సాహం కనిపించలేదు. కొందరు నిర్లిప్తంగా కూర్చున్నారు. మరికొందరు చెప్పింది తమకు కాదన్నట్లు నిరాసక్తంగా చూస్తున్నారు. అది గమనించిన మేనేజర్లో ఆందోళన మొదలైంది. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో ఉద్యోగుల్లో బాధ్యతాభావాన్ని ఎలా పెంచాలి? ప్రాజెక్ట్‌ను విజయవంతంగా ఎలా పూర్తిచేయాలి? అని ఆలోచించారు. కాసేపు విరామం ఇచ్చి తర్వాత ఒక కొత్త ఆలోచనతో వారి ముందుకు వచ్చారు. అందరినీ ఒక పేపర్, పెన్ తీసుకోమన్నారు. ఉద్యోగులందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ పేపర్లు తీసుకున్నారు. ‘ఇప్పుడు 20 సెకండ్లలో మీరు ఎన్ని సున్నాలు రాయగలరో ఆలోచించుకుని ఆ సంఖ్యను పేపర్ మీద రాయండి’ అన్నారు.
అందరూ మనసులోనే లెక్కలేసుకుని తమకు తోచిన సంఖ్యను రాసుకున్నారు. తర్వాత మేనేజర్ స్టాప్‌వాచ్ ఆన్ చేసి, ‘స్టార్ట్!’ అన్నారు. ఉద్యోగులందరూ వేగంగా సున్నాలు చుట్టడం మొదలుపెట్టారు. 20 సెకండ్లు పూర్తయ్యాక, ‘స్టాప్!’ అన్నారు. ‘ఇప్పుడు మీరు నిజంగా ఎన్ని సున్నాలు రాశారో లెక్కించండి. తర్వాత మీరు ముందుగా అనుకున్న సంఖ్యతో పోల్చండి’ అని చెప్పారు. చాలామంది తాము ముందు అనుకున్న సంఖ్య కన్నా చాలా ఎక్కువ సున్నాలే చుట్టగలిగారు. కొందరు మాత్రమే దానికి దగ్గరగానూ, తక్కువగానూ రాశారు.
అప్పుడు మేనేజర్ చిరునవ్వుతో ‘మనలో చాలామంది ముందే ఒక పరిమితిని నిర్ణయించుకుంటారు. ‘ఇంతవరకే చేయగలను’ అనుకుంటారు. కానీ ప్రయత్నం మొదలుపెట్టాక మన సామర్థ్యం ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంటుందని ఇప్పుడు మీరే నిరూపించారు. మనం చేసే ప్రతి పని సరిహద్దుల్లో ఉన్న సైనికుడికి బలాన్నిస్తుంది. కాబట్టి పరిమితులను ఛేదించి మన సామర్థ్యాన్ని నిరూపించుకుందాం’ అన్నారు.
ఆ మాటలు ఉద్యోగుల హృదయాలను తాకాయి. అందరి కళ్లలో కొత్త ఉత్సాహం కనిపించింది. మార్పు మొదలైంది. ఉద్యోగులు సమయానికి రావడమే కాదు, అవసరమైనప్పుడు అదనపు గంటలు పనిచేసి ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. అవును మరి, మనిషి తనను తాను నమ్ముకుంటే సాధ్యం కానిదేముంది?.
అభివృద్ధి చెందిన దేశాలు ఆ స్థితికి చేరుకోవడానికి కారణం శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవడమే. హేతుబద్ధత వారి పాలనా వ్యవస్థల్లో అంతర్భాగమైపోయింది. పారిశ్రామిక, సామాజిక, వైజ్ఞానిక విప్లవాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని చోటుచేసుకున్నప్పుడే సమాజం ఆధునికతను సంతరించుకుంటుంది.
ప్రశాంతచంద్ర మహలనోబిస్, గణాంక శాస్త్రవేత్త
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.