
స్వర్ణకవచంలో మెరిసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది.
చివరి రోజున ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామివారు బంగారు కవచంలో పునఃదర్శనమిచ్చారు. తిరిగి వచ్చే జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతోనే ఉంటారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు సంపంగి ప్రాకారానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. స్వామివారికి, దేవేరులకు స్నపన తిరుమంజనం అనంతరం స్వర్ణకవచాలు ధరింపజేశారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవలో ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు స్వర్ణకవచంలో దర్శనమిచ్చారు. ఆలయ మాడవీధుల్లో విహరించారు. కార్యక్రమంలో పెద్దజీయ్యర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, అదనపు ఈవో వెంకయ్యచౌదరి దంపతులు, తితిదే బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్ల, జానకీదేవి, నన్నపనేని సదాశివరావు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.
సర్వదర్శనానికి 14 గంటలు: శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు నిండి బాటగంగమ్మ ఆలయం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. వీరికి 14 గంటల్లో దర్శనం లభిస్తుందని తితిదే ప్రకటించింది. రద్దీ నేపథ్యంలో సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి కరెంట్ బుకింగ్‌ను తితిదే రద్దు చేసింది. ఆ సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించనుంది. శనివారం 85,582 మంది భక్తులు దర్శించుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.