
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ముంగిట నిలిచిన రైతులకు వాతావరణ మార్పులు సవాల్ విసురుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అంతటా ‘ఎల్నినో’ గండం కమ్ముకునే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ బృందం ‘ఎల్నినో.. క్రాప్ ప్లానింగ్’
రాష్ట్రంలో ఖరీఫ్ సాగు ముంగిట నిలిచిన రైతులకు వాతావరణ మార్పులు సవాల్ విసురుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ అంతటా ‘ఎల్నినో’ గండం కమ్ముకునే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రుతుపవనాలు ఆలస్యంగా రావడం, వర్షాల్లో తీవ్ర అస్థిరత వల్ల సుధీర్ఘ బెట్ట పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు దారి చూపేందుకు గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రు) నడుం బిగించింది. కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధనా సంస్థతో కలిసి, వర్షాభావ ముప్పు ఉన్న మండలాల కోసం ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు పాటించాల్సిన ప్రత్యేక పంట ప్రణాళికలను వర్సిటీ ఉపకులపతి డాక్టర్ పాలడుగు వెంకట సత్యనారాయణ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సిద్ధం చేసింది. ప్రాంతీయ వాతావరణం, నేలల స్వభావం, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ రకాల ఆధారంగా ‘ఎల్నినో అండ్ క్రాప్ ప్లానింగ్’ పేరిట ఈ మార్గదర్శకాలు రూపొందించింది. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో పాత పద్థతుల్లోనే సాగు చేసి నష్టపోవద్దని, వర్సిటీ సూచించిన అంతర పంటల విధానాలు, తక్కువ కాలపరిమితి గల ప్రత్యామ్నాయ రకాలను ఎంచుకొని ఎల్నినో వంటి కరువు పరిస్థితులను దీటుగా ఎదుర్కోవాలని సూచించింది. ఈ నెలాఖరున ఐఎండీ ఇచ్చే తుది అంచనాల ఆధారంగా రైతులకు మరిన్ని అప్డేట్స్ అందిస్తామని వర్సిటీ వీసీ డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు. రైతులు వర్షాల కోసం ఎదురుచూసి సమయం వృథా చేసుకోకుండా, తమ ప్రాంతాల్లోని నేల స్వభావాన్ని బట్టి నెలాఖరులోగా తాము సూచించిన పంటల్లో మేలైన రకాలను ఎంచుకోవాలని పేర్కొన్నారు. ఆయా జిల్లాలో సాగు చేయాల్సిన పంటలను వెల్లడించారు.
ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం): వర్షాధార ఎర్ర, నల్ల నేలల్లో మొక్కజొన్న, రాగి, వేరుశనగ, జనుము, పెసర, నేరుగా విత్తే వరి అనుకూలం. వరిలో ఆర్ జీ ఎల్ 2537, ఎంటీయు 1262, ఎంటీయు 1224, ఎంటీయు 1121, ఎంటీయు 1061, బీపీటీ 5204, ఎంటీయు 1318 రకాలు. వేరుశనగలో విశిష్ట, కే-9 రకాలు.
విశాఖ, అనకాపల్లి, గిరిజన ప్రాంతాలు: ఎర్ర నేలల్లో నువ్వులు, సజ్జ, వేరుశనగ, చెరకు, పెసర, మినుము, కంది, కొర్ర, సామ పంటలు వేసుకోవచ్చు. నల్ల నేలల్లో సజ్జ, వేరుశనగ, మొక్కజొన్న, మినుము, కంది, రాగి. మినుముకు ఎల్బీజీ 904, ఎల్బీజీ 932 కందికి ఎల్ఆర్జీ 52, ఎల్ఆర్జీ 105 రకాలు అనుకూలం.
గోదావరి బేసిన్ (తూర్పు, పశ్చిమ, కాకినాడ, ఏలూరు, కోనసీమ, పోలవరం): ఎర్ర నేలల్లో మొక్కజొన్న, రాగి... నల్ల నేలల్లో వరి. వరిలో ఎంటీయూ 7029, 1061, 1121, 1318, 1224, బీపీటీ 5204, ఎంసీఎం 103 రకాలు.
కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్: ఎర్ర నేలల్లో పత్తి, మొక్కజొన్న, కంది. నల్ల నేలల్లో వరి, పత్తి, కంది, పెసర. వరిలో బీపీటీ 5204, ఎంటీయు 1318, ఎంటీయు 1282, ఎంటీయు1426 రకాలు.
బాపట్ల, పల్నాడు, ప్రకాశం: మొక్కజొన్న, మినుము, పెసర, పత్తి, కంది, వేరుశనగ అనుకూలం. నల్ల నేలల్లో పత్తి-కంది అంతరపంటగా వేసుకోవచ్చు. పెసరలో ఎల్జీజీ 607, డబ్ల్యూజీజీ 42 కందిలో పీఆర్జీ 176 రకాలు శ్రేష్ఠం.
రాయలసీమ, నెల్లూరు: ఎర్ర నేలల్లో వేరుశనగ+కంది/ఆముదం (7:1), సజ్జ, రాగి, కొర్ర, టొమాటో, మిరప, మేత జొన్న. నల్ల నేలల్లో పత్తి, కంది, జొన్న, పొద్దుతిరుగుడు, పెసర, పత్తి+కంది. వేరుశనగలో కదిరి లేపాక్షి, నారాయణి, ధరణి, విశిష్ట రకాలు కొర్రలో గరుడ, సూర్యనంది, రేనాడు రకాలు.
రైతులకు నమ్మకమైన, మొలక శాతం బాగుండే విత్తనాలను అందించేందుకు వర్సిటీ అనుబంధ పరిశోధనా స్థానాలు (ఆర్ఏఆర్ఎస్), కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) విత్తనాలను సిద్ధం చేశాయి. వరి విత్తనాలు ఆర్ఏఆర్ఎస్ మారుటేరు, అనకాపల్లి, నంద్యాల ఏఆర్ఎస్ రాగోలు, మచిలీపట్నం, బాపట్ల, నెల్లూరు, రెడ్డిపల్లి, ఉటుకూరు కేవీకే ఆమదాల వలస, ఉండి, ఘంటసాల కేంద్రాల్లో లభిస్తాయి. వేరుశనగ విత్తనాలు ఏఆర్ఎస్ కదిరి, అనంతపురం, ఆర్ఏఆర్ఎస్ తిరుపతిలో అందుబాటులో ఉన్నాయి. పప్పుధాన్యాలు (కంది, పెసర, మినుము) గుంటూరు లాం ఫార్మ్ (ఆర్ఏఆర్ఎస్), ఆర్ఏఆర్ఎస్ తిరుపతితో పాటు ఆమదాలవలస, రెడ్డిపల్లి, యాగంటిపల్లి, కలికిరి కేవీకేల్లో లభ్యమవుతాయి.
ప్రతి నాలుగేళ్లకొకసారి వస్తున్న ఎల్నినో పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయాని (ఆంగ్రు)కి అపార అనుభవం ఉంది. ఇప్పుడు కూడా అన్ని శాఖల సమీక్ష నివేదిక ఆధారంగా, సమన్వయంతో రూపొందించిన ప్రత్యామ్నాయ పద్థతులను రైతులు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వర్సిటీ శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి తగిన సలహాలు, సూచనలు అందిస్తారు.
- డాక్టర్ పీవీ సత్యనారాయణ, వీసీ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ