
కొరటాల శివ సినిమా అనగానే కేవలం కథ మాత్రమే కాకుండా, దానికి ఆయన ఎంచుకునే బలమైన సామాజిక నేపథ్యం కూడా ప్రేక్షకులకు ముందే గుర్తొస్తుంది.
దర్శకుడు కొరటాల శివ సినిమా అనగానే కేవలం కథ మాత్రమే కాకుండా, దానికి ఆయన ఎంచుకునే బలమైన సామాజిక నేపథ్యం కూడా ప్రేక్షకులకు ముందే గుర్తొస్తుంది. ఇప్పటివరకు ఆయన కెరీర్లో వచ్చిన ప్రతి సినిమాలోనూ ఒక నిర్దిష్టమైన ప్రాంతం, అక్కడి ప్రజల జీవనశైలి, వారు ఎదుర్కొనే సమస్యలను కథలో చాలా బలంగా చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుండటంతో ఈ సినిమా నేపథ్యం ఏమై ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
అయితే, ఈ చిత్రానికి కొరటాల ఒక రెగ్యులర్ కానీ అత్యంత ప్రభావవంతమైన రాయలసీమ నేపథ్యాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలయ్యకు కెరీర్ పరంగా బాగా కలిసివచ్చిన రాయలసీమ ప్రాంతాన్ని, అక్కడ దశాబ్దాలుగా పీడిస్తున్న నీటి సమస్యను ప్రధానాంశంగా తీసుకుని ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నారనే వార్త నందమూరి అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. కొరటాల శివ మార్కు కథనానికి తగ్గట్టుగా బాలయ్య లుక్ అండ్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నట్లు సమాచారం.
ఇక ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న తాజా రూమర్ల ప్రకారం.. ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోందట. ఫ్లాష్‌బ్యాక్‌లో బాలయ్య పాత్రకు మాఫియా బ్యాక్‌డ్రాప్ ఉంటుందని, అది కథను ఊహించని మలుపు తిప్పుతుందని అంటున్నారు. మొత్తానికి బాలకృష్ణను ఒక పూర్తిస్థాయి పవర్ఫుల్ మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తూనే, కొరటాల తనదైన స్టైల్ ఎలివేషన్లతో థియేటర్లలో పూనకాలు తెప్పించేలా స్క్రిప్ట్‌ను డిజైన్ చేశారట. సాధారణంగా బాలయ్య సినిమాల్లో యాక్షన్, డైలాగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కానీ కొరటాల శివ ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే ఈ కథాంశం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుందని టాక్. రాయలసీమ నీటి కష్టాలు, మాఫియా డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్.. ఇలా అన్ని వాణిజ్య హంగులను సమపాళ్లలో కుదిర్చి ఒక ప్రత్యేకమైన కథను కొరటాల శివ సిద్ధం చేశారు. ‘దేవర’ లాంటి భారీ విజయం తర్వాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో, ఆయన ఈ స్క్రిప్ట్‌పై చాలా కాలం పాటు ప్రత్యేక కసరత్తులు చేసి ప్రతి సన్నివేశాన్ని ఎంతో పకడ్బందీగా మలిచారు.
భారీ అంచనాలున్న ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళడానికి సర్వం సిద్ధమవుతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే, వచ్చే ఆగస్టు నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని పరిశ్రమ వర్గాల భోగట్టా. టాలీవుడ్లో వరుస క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి, అత్యున్నత సాంకేతిక విలువల తో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలయ్య మాస్ పవర్, కొరటాల సామాజిక సందేశం తోడవుతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందోనని అప్పుడే ట్రేడ్ వర్గాల్లో సైతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.