వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో ముందు నుంచే జనాల్లో ఆసక్తి ఏర్పడింది. దీనికి తోడు వైవిధ్యమైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రోజురోజుకీ ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఆల్రెడీ సినిమా చూసిన మహేష్.. టెర్రిఫిక్ అంటూ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. తాజాగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కూడా సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘రావు బహదూర్’ స్పెషల్ ప్రివ్యూ చూసిన సుకుమార్.. సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇదొక ఒక సర్రియల్ సినిమా అని, తెలుగులోనే కాదు భారతీయ సినీ పరిశ్రమలో ఇలాంటి మూవీ ఇప్పటివరకు వచ్చిందని తాను అనుకోవడం లేదని అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత వెంకటేష్ మహా నిజంగా అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారని సుక్కు కొనియాడారు. ఒక యాక్టర్ జీవితంలో చాలా అరుదుగా ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని, సత్యదేవ్‌కు టీమ్ మొత్తం కలిసి ఇచ్చిన గొప్ప బహుమతి ఈ పాత్ర అని పేర్కొన్నారు. రావు బహదూర్ ప్రపంచం అద్భుతంగా ఉందని, కాస్ట్యూమ్స్ నుంచి ప్రతి టెక్నికల్ విభాగం వరకు ,మంచి పనితీరు కనబరిచారని దర్శకుడు మెచ్చుకున్నారు. సుకుమార్ మాట్లాడుతూ.. ''అందరూ కలిసి సత్యదేవ్ కి గిఫ్ట్ ఇచ్చినట్టే లెక్క. అసలు ఏ ఆర్టిస్టుకి కూడా ఇలాంటి క్యారక్టర్ క్రియేట్ అయ్యే అవకాశమే లేదు. ప్రతీ ఆర్టిస్ట్ జెలసీగా ఫీల్ అవుతాడు. ఇలాంటి మూవీ తెలుగులోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే ఎప్పుడూ రాలేదు. చాలా డిఫరెంట్ జోనర్. 8 ఏళ్లు ఆగినా దర్శకుడు వెంకటేష్ మహా మొత్తానికి సాధించాడు. 'C/o కంచెరపాలెం'కి ఎలా షాక్ ఇచ్చాడో, ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి అద్భుతమైన సినిమా తీశాడు'' అని అన్నారు. ''నిజంగా ఆ వరల్డ్ క్రియేషన్, కాస్ట్యూమ్స్.. అన్నీ చాలా బాగున్నాయి. ప్రతీ క్రాఫ్ట్ వేరే రేంజ్ లో ఉన్నాయి. అందరు టాలెంటెడ్ టెక్నిషియన్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు. కథ రాసుకోవడం వేరు. ఆ కథ ఆత్మను కోల్పోకుండా, ఇంత సర్రియల్ గా తెరపైకి తీసుకురావడం వేరు. రియల్ కథ చెప్తున్నప్పుడు కూడా నేరేషన్ అంతా ఒక ట్రాన్స్ లాగా వెళ్తుంది. చాలా బాగా అనిపించింది. ఇలాంటి సినిమా తీయడం ఈజీ కాదు. రాసేటప్పుడే ఆ విషయం మనకి అర్థమవుతుంది. ఆ ఫీల్ అనేది సినిమా మొత్తం ఉంది. ఇది చాలా డిఫరెంట్ మూవీ. అనురాగ్ రెడ్డి లాంటి నిర్మాత దొరకడం వెంకటేష్ మహా అదృష్టం. సినిమా అంటే చాలా ఇష్టం ఉన్నవారే ఇలాంటివి ప్రొడ్యూస్ చేయగలరు'' అని సుకుమార్ పేర్కొన్నారు.ఇప్పటికే ‘రావు బహదూర్’ చిత్రాన్ని చూసిన మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ''ఇది మిమ్మల్ని కాలర్ పట్టుకుని లాగే సినిమా మాత్రమే కాదు, మీ చర్మంలోకి చొచ్చుకుపోయే సినిమా కూడా. చాలా విచిత్రంగా, అందంగా, ఇంటెన్స్ డ్రామాతో ఉంటుంది. వెంకటేష్ మహా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. సత్యదేవ్ తనదైన శైలిలో ఆ ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. దీపా థామస్ తన అద్భుతమైన నటనతో మెరిసింది. అద్భుతమైన నటీనటులు, అత్యుత్తమ సాంకేతిక బృందం కలిసి ఈ సినిమాను అంతే అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలాంటి టీమ్ ని చూసి చాలా గర్వంగా ఉంది. జూలై 3వ తేదీన రావు బహదూర్ మ్యాడ్ నెస్ ని చూడటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా'' అని మహేష్ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు సుకుమార్ నుంచి కూడా ప్రశంసలు అందుకోవడంతో, ‘రావు బహదూర్’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.