ఇండియన్ సినిమాలో అపజయం ఎరుగని దర్శకులలో ఎస్.ఎస్. రాజమౌళి ఒకరు. ఇప్పటి వరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ హిట్టే. కెరీర్ ప్రారంభం నుంచీ వేటికవే ప్రత్యేకమైన చిత్రాలను రూపొంది
స్తూ, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటున్నారు. ఆయన సినిమాలను మనం నిశితంగా పరిశీలిస్తే.. ప్రతీ చిత్రంలో భారీ హంగులతో పాటుగా బలమైన ‘ఎమోషన్’ ఉంటుంది. ఏ జోనర్ లో సినిమా తీసినా, ఎలాంటి కథను తెరకెక్కించినా అందులో ఎమోషన్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటారు. ఇప్పుడు ‘వారణాసి’ మూవీలోనూ భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తున్నారు రాజమౌళి. సినిమా జానర్ ఏదైనా, ఎలాంటి కథ అయినా, పాత్రలు ఎలాంటివైనా.. కీలకమైన ‘ఎమోషన్’ ను బలంగా ఒడిసి పట్టుకొని, దాన్ని తెరపై అద్భుతంగా చూపించడంలో రాజమౌళి దిట్ట. ఒళ్లు గగుర్పరిచే యాక్షన్ ఘట్టాలు, కళ్లు చెదిరే సెట్లు, భారీ హంగులతో పాటుగా భావోద్వేగాలు ఉండేలా చూసుకుంటారు. కోర్ పాయింట్ ను గట్టిగా పట్టుకొని, దాంతో ప్రతీ ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దుతారు. అదే జక్కన్న విజయ రహస్యం అని చెప్పాలి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాలో ఎమోషన్ ఏంటనేది తాజాగా ఆయన బయటపెట్టారు. ‘వారణాసి’ అనేది మల్టీ జోనర్ మూవీ. ఇందులో మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్.. ఇలా అనేక అంశాలు ఉండబోతున్నాయి. అందులో తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ అనేది కోర్ పాయింట్. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ‘వారణాసి’ సినిమా సంగతులను పంచుకున్నారు.రాజమౌళి మాట్లాడుతూ “ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాల దగ్గర నుంచి అంటార్కిటికాలోని చలి, మంచు వరకు.. రామాయణంలోని దేవుళ్ల నుంచి జాతీయ విపత్తులు, ఫాంటసీ ఎలిమెంట్స్ వరకు.. ఇలా అనేక అంశాలను ‘వారణాసి’ అనే ఒకే సినిమాలో ప్రేక్షకులు అనుభూతి చెందబోతున్నారు. కానీ నేను మొదట్లోనే చెప్పినట్లుగా, తండ్రీకొడుకుల మధ్య ఉండే అనుబంధం వీటన్నిటికీ మూలంగా ఉంటుంది. అక్కడ్నుంచే ఈ ఫాంటసీ వరల్డ్ మొదలవుతుంది” అని అన్నారు.* ‘వారణాసి’లో ఒక్క షాట్ కోసం 94 టేకులు తీసుకున్న మహేష్ బాబు, పృథ్వీరాజ్‘వారణాసి’ సినిమాలో రుద్ర అనే పాత్రలో మహేష్ బాబు కనిపించనున్నారు. ఆయన తండ్రిగా, మహా శివ భక్తుడి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారని సమాచారం. వీళ్లిద్దరి కాంబోలో గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా వచ్చాయి. వాటిల్లో తండ్రీకొడుకులుగానూ నటించారు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారని అంటున్నారు. జక్కన్న చెప్పినదాన్ని బట్టి చూస్తే, వీరి మధ్య బాండింగే సినిమా ప్రధాన ఇతివృత్తం. రుద్ర పాత్ర ఖండాలు దాటి విశ్వంతరాల్లోకి ప్రయాణించడానికి కారణం ఏంటనేది ‘వారణాసి’ కథ అని తెలుస్తోంది. అయితే ఈ కథలోకి పురాణాలు, ఇతిహాసాలను ఎలా తీసుకొస్తారు? రాముడు, కుంభ కర్ణుడి మధ్య యుద్ధాన్ని ఈ స్టోరీకి లింకేంటి? అనేది ఆసక్తికరం. ఏదేమైనా దర్శక ధీరుడు రాజమౌళి ఈసారి చాలా పెద్ద కథను భుజానికెత్తుకున్నారని అర్థమవుతోంది. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు.. ఆఫ్రికా నుంచి అంటార్కిటికా మంచు ఖండాల వరకూ విస్తరించిన కథను చెప్పబోతున్నారు. ఇది ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది తెలియాలంటే, 2027 ఏప్రిల్ 7 వరకూ వేచి చూడాల్సిందే.