
బాంబుతో ప్రియురాలికి బెదిరింపులు సజీవదహనమైన ప్రియుడు బెంగళూరు(గ్రామీణం), న్యూస్‌టుడే: కారులో వెళ్తూ పెట్రోల్ బాంబుతో ప్రియురాలిని బెదిరించాలని చూసిన ప్రియుడు చివరికి తన ప్రాణాలనే కోల్పోయాడు.
ఆమె చాకచక్యంగా కిందకు దూకేసి బతికిపోగా.. అతను సజీవదహనమయ్యాడు. బెంగళూరు జయనగరలో ఉంటున్న ఓ యువతి స్థానిక సంజయ్ గాంధీ ఆసుపత్రిలో ఓటీ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఆరేళ్లుగా నాగేంద్ర(30), ఆమె మధ్య స్నేహం, ప్రేమ కొనసాగాయి. కొద్ది రోజులుగా అతని సెల్‌ఫోన్ నంబర్‌ను ఆమె బ్లాక్ చేసి దూరంగా ఉంటోంది. దీంతో శనివారం వేకువజామున నాగేంద్ర కారు అద్దెకు తీసుకొని యువతి గదికి వచ్చాడు. తనతో అంకోలాకు రావాలని గొడవ చేశాడు. ఇద్దరూ కలిసి ఉదయం ఏడు గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరారు. తుమకూరు దాటిన తర్వాత తనను వివాహం చేసుకోవాలని, లేకపోతే హత్య చేస్తానని పెట్రోల్ బాంబు తీసి బెదిరించాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో తల, చేతులపై కత్తితో దాడి చేశాడు. అప్పటికి కారు శిరా సమీపంలోని జోగిహళ్లి ప్రాంతానికి చేరుకుంది. నెమ్మదిగా వెళ్తున్న కారు తలుపు తీసుకుని యువతి చాకచక్యంగా కిందకు దూకింది. అనంతరం క్షణాల వ్యవధిలో పెట్రోల్ బాంబు పేలి కారుతో సహా నాగేంద్ర మంటల్లో కాలిపోయాడు. ప్రియురాలు దూకుతున్నట్లు గమనించి.. ఆమెను చంపాలనే ఉద్దేశంతో పెట్రోలు బాంబు పేల్చేశాడా, లేక ప్రమాదవశాత్తు పేలిందా అన్న కోణంలో కళ్లంబెళ్ల ఠాణా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.