
మహిళల టీ20 ప్రపంచకప్ భారత మహిళలకు చావోరేవో నేడు ఆసీస్‌తో ఢీ రాత్రి 7 నుంచి లండన్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అత్యంత కీలకమైన, కఠినమైన పోరుకు సిద్ధమైంది.
సెమీస్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన.. భీకర ఆస్ట్రేలియా జట్టును ఢీకొనబోతోంది. రెండు జట్లకూ ఇదే చివరి లీగ్ మ్యాచ్. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయాలు సాధించిన ఆసీస్.. దాదాపుగా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. భారత్ చేతిలో ఓడినా.. నెట్ రన్‌రేట్ (+4.724)లో ఎంతో మెరుగ్గా ఉండడం వల్ల ఆసీస్ అగ్రస్థానంతో ముందంజ వేసే అవకాశాలే ఎక్కువ. భారత్ మాత్రం గెలిస్తేనే సెమీస్ చేరే స్థితిలో ఉంది. ఆ జట్టు 4 మ్యాచ్‌ల్లో మూడు నెగ్గి, ఒకటి ఓడింది. రెండో సెమీస్ బెర్తు కోసం భారత్‌తో పోటీ పడుతున్న దక్షిణాఫ్రికా కూడా నాలుగింట్లో మూడు నెగ్గింది. అయితే ఆ జట్టు ఆదివారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు ఘనంగా గెలుస్తుందని అంచనా. ఆస్ట్రేలియా చేతిలో ఓడినా భారత్ ముందంజ వేయాలంటే.. బంగ్లా చేతిలో దక్షిణాఫ్రికా కూడా ఓడిపోవాలి.
ప్రస్తుతం నెట్‌రన్‌రేట్‌లో దక్షిణాఫ్రికా (+0.734) కంటే భారత్ (+2.268) మెరుగ్గా ఉంది. ఆదివారం మధ్యాహ్నమే దక్షిణాఫ్రికా, బంగ్లా మ్యాచ్ జరగనుండడంతో భారత్ పరిస్థితేంటో ఆసీస్‌తో పోరు కంటే ముందే స్పష్టత వస్తుంది. ఈ టోర్నీలో ఫామ్ ప్రకారం చూస్తే.. కంగారూ జట్టును ఓడించడం హర్మన్‌ప్రీత్ సేనకు అంత తేలిక కాదు. కానీ నిరుడు వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించడం, ఈ ఏడాది ప్రత్యర్థి సొంతగడ్డపై టీ20 సిరీస్ నెగ్గడం భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచేవే. స్మృతి మంధాన, షెఫాలి వర్మ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేసి.. హర్మన్‌ప్రీత్, జెమీమా, రిచా ఘోష్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత్ పెద్ద స్కోరు చేయడానికి, సవాలు విసిరే లక్ష్యాన్నైనా ఛేదించడానికి అవకాశముంటుంది. బౌలింగ్‌లో ఆశలన్నీ స్పిన్నర్లు శ్రీ చరణి, దీప్తి శర్మల మీదే ఉన్నాయి. పేసర్లు రేణుక, నందని ఇంకా మెరుగుపడాల్సి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.