
దిల్లీ: తెరచాపతో నడిచే భారతీయ నౌకాదళ శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని అంతర్జాతీయ సముద్రయానంలో భాగంగా అమెరికా చేరుకుంది.
అమెరికా 250వ స్వాతంత్య్రదిన వేడుకల్లో ఈ నౌక పాల్గొంటుందని అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. సుదర్శిని ఈనెల 26న మేరీలాండ్లోని బాల్టిమోర్ చేరుకుంది. అంతకుముందు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అనేక తెరచాప నౌకలతో పాటు అది ‘సెయిల్ 250 వర్జీనియా’ వేడుకల్లో ఈనెల 19 నుంచి 23 వరకూ పాల్గొందని భారతీయ నౌకాదళ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెరికా ఏటా జులై 4న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటుంది. ఐఎన్ఎస్ సుదర్శిని ఖండాంతరయానం అనంతరం బాల్టిమోర్ చేరుకోవడం ఉజ్వలమైన భారతీయ నౌకాయాన చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. భారత, అమెరికా నౌకాదళాల మధ్య నెలకొన్న స్నేహానికి అద్దంపట్టిందని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. తెరచాప ద్వారా నడిచే సుదర్శిని నౌక కొచ్చిన్ నుంచి నార్ఫోక్ వరకూ 13 వేల నాటికల్ మైళ్ల దూరాన్ని ఐదు నెలల్లో పూర్తిచేసింది. అంతర్జాతీయ సుహృద్భావాన్ని పెంపొందించడానికి, ఉజ్వలమైన భారత నావికా సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ యాత్ర ఉపయోగపడిందని అధికార ప్రతినిధి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.