
అయోధ్య: భక్తులు అయోధ్యలోని రామాలయానికి ఇచ్చిన కానుకలు, విరాళాలు, వెండి ఇటుకలు, ఆభరణాలు సురక్షితంగానే ఉన్నాయని ‘రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు’ స్పష్టంచేసింది.
ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రలు రాజీనామా చేయడం వాస్తవమేనని ధ్రువీకరించింది. వాటిపై ట్రస్టు తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామంది. ఆలయంలో వెలుగుచూసిన ఘటనలు దిగ్భ్రాంతికరం, విచారకరమని ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. ‘‘రామ మందిరానికి ఇచ్చిన కానుకలన్నింటికీ రికార్డులు పక్కాగా ఉన్నాయి. భక్తుల విశ్వాసాన్ని తిరిగి చూరగొనేలా నిష్పాక్షిక విచారణకు ట్రస్టు నుంచి అన్నివిధాలా సహకారం ఉంటుంది. హుండీల ద్వారా వచ్చిన డబ్బు దుర్వినియోగం అయిందన్న ఆరోపణలపై యూపీ ప్రభుత్వం నియమించిన సిట్ నుంచి మధ్యంతర నివేదిక రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయించాం. ఇలాంటి ఘటనలు ఇకమీదట జరగబోవనిహామీ ఇస్తున్నాం’’ అని ట్రస్టు పేర్కొంది.
లఖ్‌నవూ: భక్తుల నుంచి అందిన విరాళాలను నిర్వహించడంలో, కానుకలు లెక్కించడంలో ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్వోపీ)ని అయోధ్య రామాలయం విషయంలో పాటించలేదని ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్) గుర్తించింది. ఎంత మొత్తాన్ని ఎలా పక్కదారి పట్టించారనే వివరాలపై దర్యాప్తు కొనసాగుతుండగా ఆలయంలో పలు తప్పుల్ని సిట్ ప్రాథమిక నివేదికలో ప్రస్తావించింది. కానుకలు లెక్కిస్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డును ఉంచడం, పరకామణి లోపలకు సిబ్బంది వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు తనిఖీ చేయడం, సీసీటీవీ ఫుటేజీని 180 రోజులపాటు భద్రపరచడం.. ఇలాంటివేవీ జరగలేదని గుర్తించింది. ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాజీ డ్రైవరు రామశంకర్ యాదవ్ వద్ద అనేక హుండీల తాళాలు ఉండేవని, ఇది నిబంధనలకు విరుద్ధమని తప్పుబట్టింది. దీనివల్లనే కానుకలు చోరీ అయ్యాయని అభిప్రాయపడింది. ట్రస్టులోని ‘కీలక వ్యక్తి’ సిఫార్సు మేరకు హుండీ ఆదాయ లెక్కింపునకు బాధ్యునిగా సుభాష్ శ్రీవాస్తవను నియమించారని గుర్తించింది.
ముంబయి, వయనాడ్: హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటూ వారిని భాజపా వంచిస్తోందని శివసేన-యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రలోని యవత్మాల్-వాశిం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆరోపించారు. ‘భాజపా-ముక్త్ రామ్’ కోసం పోరాటానికి తమ పార్టీ నేతృత్వం వహిస్తుందని చెప్పారు. నిజమైన హిందుత్వమంటే మానవత్వమేనన్నారు. ‘ఆలయాలను దోచుకునే తరహా భాజపా హిందుత్వాన్ని’ తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. తాము ఇచ్చిన వెండి ఇటుకలు, విరాళాలు ఏమయ్యాయో చెప్పాలన్నారు.
అయోధ్య రామాలయ కానుకల్ని దోచుకోవడం విచారకరం, సిగ్గుచేటైన విషయమని కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. బాధ్యులందరికీ జవాబుదారీతనం నిర్ణయించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎంతో నమ్మకంతో భక్తులిచ్చిన విరాళాలను దొంగిలించడం విషాదకరమని వయనాడ్‌లో విలేకరుల సమావేశంలో చెప్పారు.
దిల్లీ: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై ప్రధాని నరేంద్రమోదీ మౌనం వీడాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానుకలు పక్కదారి పట్టడానికి బాధ్యులైనవారందరినీ వెంటనే అరెస్టు చేయాలని, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పార్టీ అధికార ప్రతినిధి అఖిలేశ్ ప్రసాద్ సింగ్ శనివారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ట్రస్టు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్య ఉదంతంలో చంపత్‌రాయ్, అనిల్ మిశ్రలను అరెస్టు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ డిమాండ్ చేశారు. ఆలయం కోసం 12.5 కోట్ల మంది నుంచి వసూలు చేసిన విరాళాలకు లెక్కల్లేవని ఆరోపించారు.
రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు పనుల్లో అధికారుల ప్రమేయం ఎంతమాత్రం వద్దని అయోధ్యకు చెందిన సాధువులు డిమాండ్ చేస్తున్నారు. అవినీతి నిలువెల్లా ఉండేది అధికార యంత్రాంగంలోనే అని, అందువల్ల బ్యూరోక్రసీ నుంచి ఎవరినీ ట్రస్టులో జోక్యం చేసుకోనివ్వరాదని అయోధ్యకు చెందిన మిథిలేశ్ నందిని శరణ్ అనే సాధువు విజ్ఞప్తి చేశారు. వేర్వేరు వర్గాలకు చెందిన సాధువుల ప్రాతినిధ్యం ఉండాలే గానీ వేరే ఏ అధికారిని సీఈవోగా నియమించినా తమ మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు. మతపరమైన వ్యవహారాల్లో అధికారుల ప్రమేయాన్ని అనుమతించేది లేదని మరో సాధువు మహంత్ ధరందాస్ తేల్చిచెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.