ఒంగోలు గిత్త.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని జంతువు. బలానికి, రాజసానికి కేరాఫ్ అడ్రస్ ఒంగోలు గిత్తలు.
అయితే ఒంగోలు గిత్తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా ప్రకటించాలని కోరుతూ ఏపీ మంత్రి నారా లోకేష్ వద్దకు ప్రతిపాదన చేరింది. కల్లూరి సురేష్ అనే వ్యక్తి మంత్రి నారా లోకేష్ ఎదుట ఈ ప్రతిపాదన ఉంచారు.కొన్ని తరాలుగా వ్యవసాయంలో రైతులకు తోడుగా నిలిచి, ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితుల్లో వున్న ఒంగోలు గిత్తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా ప్రకటించాలని నారా లోకేష్‌ను కోరారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్.. ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఒంగోలు జాతి గిత్తలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాయి. కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి వీటి సొంతం. వీటి శారీరక దారుఢ్యం మిగతా ఎద్దులు, గిత్తలతో పోలిస్తే వీటిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. సుమారు 11 వందల కేజీల వరకూ ఇవి బరువు పెరుగుతాయి. బలమైన కాళ్లు, పెద్ద మూపురం, చిన్న కొమ్ములతో రాజసం ఉట్టిపడేలా ఠీవీగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఎండాకాలం, అతిశీతల వాతావరణాలను రెండింటినీ తట్టుకునే సామర్థ్యం వీటి సొంతం. ఇక ఎంతటి బరువును అయినా సునాయాసంగా లాగగలిగే సామర్థ్యంతో రాతిదూలం లాగుడు పోటీలలో ఇవి ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. ఒంగోలు జాతి గిత్తలు కేవలం మనదేశంలోనే కాకుండా అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలలోనూ ఇవి కనిపిస్తాయి. వీటికి ఉన్న ప్రత్యేకతల నేపథ్యంలో మార్కెట్లో వీటి విలువ అధికంగా ఉంటుంది.ఒంగోలు జాతి గిత్తల శారీరక ధారుడ్యం అవి తినే పౌష్టికాహారం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే రైతులు వీటి పోషణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. బండలాగుడు పోటీలకు సిద్ధం చేసే ఒంగోలు గిత్తలకు ప్రత్యేకమైన ఆహారం అందిస్తుంటారు. ఉడకబెట్టిన ఉలవలు, బాదం, జీడిపప్పు వంటి ఆహారం అందిస్తుంటారు. కేవలం మేతకే పరిమితం కాకుండా నడక వంటి వ్యాయామాలు కూడా చేయిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒంగోలు గిత్తను ఏపీ రాష్ట్ర జంతువుగా ప్రకటించాలనే ప్రతిపాదన మంత్రి లోకేష్ వద్దకు చేరడం ఆసక్తికరంగా మారింది.