
Bhagirath Choudhary Subsidy : కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి (Bhagirath Choudhary) తన సొంత మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న పథకం కింద దాదాపు రూ.99లక్షల సబ్సిడీ పొందారు.
union minister bhagirath choudhary cucumber farm subsidy row
Bhagirath Choudhary Subsidy : కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి (Bhagirath Choudhary) తన సొంత మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న పథకం కింద దాదాపు రూ.99లక్షల సబ్సిడీ పొందారు. ప్రస్తుతం ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పలువురు మంత్రి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాను రైతునని.. మంత్రి హోదాలో కాకుండా రైతుగా దరఖాస్తు చేశానని.. అన్ని నిబంధనలు పాటించానని మంత్రి చెబుతుండగా.. అవినీతిలో ఇదో కొత్త మోడల్ అంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది.
కేంద్ర సహాయ మంత్రి భగీరథ్ చౌదరి పొందిన ఈ సబ్సిడీ నేషనల్ హార్టికల్చర్ బోర్డు (NHB) డెవలప్మెంట్ ఆఫ్ కమర్షియల్ హార్టికల్చర్ పథకం కింద మంజూరైంది. ఈ బోర్డుకు కేంద్ర వ్యవసాయ మంత్రి అధ్యక్షుడిగా, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి హోదాలో భగీరథ్ చౌదరి ఎక్స్ అఫిషియో ఉపాధ్యక్షుడిగా ఉంటారు. అయితే, ప్రాజెక్టులకు తుది ఆమోదం ఇచ్చే కమిటీలో మంత్రి సభ్యుడు కాదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
రాజస్థాన్లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో దోసకాయల సాగు కోసం ఏర్పాటు చేసిన పాలీహౌస్ ప్రాజెక్టుకు ఈ భారీ సబ్సిడీ పొందారు. అధికారిక వివరాల ప్రకారం.. రూ.1.99 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 50శాతం వరకు సబ్సిడీగా రూ.99.60లక్షలు మంజూరయ్యాయి. మిగిలిన మొత్తంలో రూ.1.49 కోట్లను బ్యాంకు రుణంగా, మిగతా మొత్తాన్ని సొంత నిధులతో సమకూర్చినట్లు సమాచారం. 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద మొత్తం 467 ప్రాజెక్టులకు మాత్రమే ఆమోదం లభించగా.. వాటిలో ఇది ఒకటి కావడం గమనార్హం.
కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉండి భారీ స్థాయిలో సబ్సిడీ పొందడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. అవినీతికి కొత్త మోడల్ గా అభివర్ణించారు. అధికారంలో ఉన్న మంత్రి తన మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకం కింద భారీ మొత్తంలో సబ్సిడీ పొందడం నైతికంగా సమంజసం కాదని ఆయన విమర్శించారు.
అయితే, తనపై వస్తున్న విమర్శలకు కేంద్ర సహాయ మంత్రి భగీరథ్ చౌదరి ఘాటనే సమాధానం ఇస్తున్నారు. నేను ముందుగా రైతును. రాజకీయాల్లోకి రాకముందే వ్యవసాయం చేస్తున్నా. ఈ పథకం కోసం నేను దరఖాస్తు చేసిన సమయంలో మంత్రిని కాదు. పూర్తిగా నిబంధనల ప్రకారమే దరఖాస్తు చేసుకున్నాను. ఇందులో ఏ విషయాన్నీ దాచిపెట్టలేదు. ప్రక్రియ మొత్తం పారదర్శకంగానే జరిగిందని చెప్పుకొచ్చారు.