తెలంగాణలో పులుల సంరక్షణకు చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని అర్థం అవుతోంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ) 2026 సర్వేలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో మొత్తం 42...
తెలంగాణలో పులుల సంరక్షణకు చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని అర్థం అవుతోంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ) 2026 సర్వేలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో మొత్తం 42 పులులను గుర్తించినట్లు అటవీ శాఖ ప్రాథమిక నివేదిక వెల్లడించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో గుర్తించిన 42 పులుల్లో.. 18 ఆడ పులులు, 14 మగ పులులు, 2 సబ్ అడల్ట్స్, 8 పులి పిల్లలు ఉన్నాయని తెలుస్తోంది. 2,611 చదరపు కిలోమీటర్ల అడవిలో 2,240 కెమెరా ట్రాప్‌లతో 8 నెలలపాటు సర్వే నిర్వహించారు. పులి పిల్లల ఉనికి ఎక్కువగా కనిపించడం సంతానోత్పత్తి విజయానికి సంకేతమని అధికారులు తెలిపారు. ఈ సర్వే పులుల సంరక్షణకు కీలకమైన శాస్త్రీయ సమాచారాన్ని అందించనుంది.అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 2025 నవంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు మొత్తం 8 నెలలపాటు ఈ సర్వేను నిర్వహించారు. పులుల కదలికలను కచ్చితంగా గుర్తించేందుకు టైగర్ రిజర్వ్‌ను 2 చదరపు కిలోమీటర్ల గ్రిడ్లుగా విభజించారు. మొత్తం 1120 ప్రాంతాల్లో 2240 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. ఈ సర్వేను 4 విడతలుగా నిర్వహించగా.. ప్రతి విడతలో కెమెరాలను 30 రోజుల పాటు నిరంతరంగా పర్యవేక్షించారు. దీంతో పులులతో పాటు ఇతర వన్యప్రాణుల సంచారం కూడా ఆ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.ఈ సర్వేను అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్. హిరేమత్యయ నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర పర్యవేక్షణలో నిర్వహించారు. ఫారెస్ట్ డివిజనల్ అధికారులు, రేంజ్ అధికారులు, ఫ్రంట్‌లైన్ ఫారెస్ట్ సిబ్బంది, రిజర్వ్ బయాలజిస్టులు, హైటికోస్ బృందం కలిసి ప్రణాళిక రూపొందించడం నుంచి డేటా విశ్లేషణ వరకు అన్ని దశల్లో పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా నిర్వహించే జాతీయ పులుల అంచనా కార్యక్రమంలో ఈ కెమెరా ట్రాప్ సర్వే అత్యంత కీలకంగా ఉంటుంది. ఈ సర్వే ద్వారా పులుల జనాభా, వాటి వ్యాప్తి, ఆహార జీవుల లభ్యత, అడవుల నాణ్యత వంటి అంశాలపై శాస్త్రీయ సమాచారాన్ని సేకరిస్తారు. ఈ సమాచారం భవిష్యత్తులో పులుల సంరక్షణకు మరింత సమర్థవంతమైన వ్యూహాలు రూపొందించేందుకు ఉపయోగపడుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.