
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక అంశాలకు వినోదాన్ని మేళవించి, ఇంటిల్లిపాదీ చూడదగ్గ కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో కె.భాగ్యరాజ్‌ది అందెవేసిన చెయ్యి. ముఖ్యంగా స్క్రీన్‌ప్లేతో కట్టిపడేయడం ఆయన శైలి.
అందుకే ఆయన్ను ‘స్క్రీన్‌ప్లే కింగ్’ అని అభిమానులు పిలుచుకుంటారు. కె.భాగ్యరాజ్(Bhagyaraj) కెరీర్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన 5 చిత్రాలకు సంబంధించిన విశేషాలపై ప్రత్యేక కథనం.
అంద 7 నాట్కల్ (Andha 7 Naatkal): తమిళ హాస్య నటుడు జె.పి.చంద్రబాబు నిజ జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో భాగ్యరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘అంద 7 నాట్కల్’. తెలుగులో ‘ఆ 7 రోజులు’ అని అర్థం. భాగ్యరాజ్‌తో పాటు రాజేశ్, అంబిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది తమిళంలో ఘన విజయం సాధించడంతో తెలుగులో ‘రాధా కల్యాణం’గా ప్రముఖ దర్శకుడు బాపు రీమేక్ చేశారు. ఇందులో చంద్రమోహన్, రాధిక, శరత్‌బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీలో ‘వో సాత్ దిన్’, కన్నడలో ‘లవ్ మాడి నోడు’గా రీమేక్ అయింది.
కథేంటంటే: అంబిక తమ ఇంటి పై పోర్షన్లో అద్దెకు ఉంటున్న రాజేశ్‌ను ప్రేమిస్తుంది. ఆమె తల్లిదండ్రులు ఆ బంధానికి అడ్డుపడి, అప్పటికే భార్యను కోల్పోయి ఓ బిడ్డకు తండ్రిగా ఉన్న సంపన్నుడైన భాగ్యరాజ్‌తో బలవంతంగా వివాహం చేస్తారు. అయితే తొలిరాత్రే ఆత్మహత్యాయత్నం చేసిన అంబిక తాను రాజేశ్‌ను ప్రేమిస్తున్నట్లు భాగ్యరాజ్‌కు చెబుతుంది. అంబిక స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకున్న భాగ్యరాజ్ ఆమెను రాజేశ్‌తో కలుపుతానని మాటిస్తూనే ఓ అభ్యర్థన చేస్తాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లి 7 రోజులకు మించి బతకదని, అప్పటివరకూ తన భార్యలాగే నడుచుకుంటే ఆమె సంతృప్తితో ఈ లోకాన్ని వీడుతుందని చెబుతాడు. అందుకు అంబిక అంగీకరిస్తుంది. ఆ వారం రోజుల్లో భాగ్యరాజ్ బిడ్డతో ఆమెకు అనుబంధం పెరుగుతుంది. మరి భాగ్యరాజ్ తల్లి మరణించాక, అంబిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? తన ప్రేమికుడు రాజేశ్‌తో కలసి జీవించేందుకు భర్తను వీడి వెళ్లిందా? అంబికకు ఇచ్చిన మాటను భాగ్యరాజ్ నిలబెట్టుకున్నాడా? మరోవైపు రాజేశ్ ఆమెను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడా? అనే అంశాలను అద్భుతంగా మేళవించి భాగ్యరాజ్ తెరకెక్కించారు. ‘ఒకరి ప్రియురాలు మరొకరికి భార్య కావొచ్చేమో కానీ, ఒకరి భార్య మరొకరికి ప్రియురాలు కాబోదు’ అన్న సందేశంతో, సంప్రదాయ విలువలకు పట్టంకట్టిన ఈ సినిమా తమిళ చిత్రసీమ నుంచి వచ్చిన ఉత్తమ రిలేషన్షిప్ డ్రామా చిత్రాల్లో ఒకటిగా పేరు సంపాదించుకుంది.
ముందనై ముడిచ్చు(Mundhanai Mudichu): భాగ్యరాజ్ కెరీర్లో మరపురాని చిత్రం ‘ముందనై ముడిచ్చు’. తాను ప్రత్యక్షంగా చూసిన ఓ సంఘటన ఆధారంగా ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భాగ్యరాజా, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగులో ‘మూడుముళ్లు’ పేరుతో జంధ్యాల రీమేక్ చేశారు. హిందీలో ‘మాస్టార్జీ’, కన్నడలో ‘హల్లి మేస్టారు’ పేరుతో రీమేకైంది.
కథేంటంటే: భార్యను పోగొట్టుకున్న భాగ్యరాజ్ ఓ పల్లెటూరిలో టీచరుగా పనిచేస్తుంటాడు. అదే ఊరికి చెందిన ఊర్వశి అతన్ని చూసి ఇష్టపడుతుంది. ఎలాగైనా అతడితో మూడుముళ్లు వేయించుకోవాలనుకుంటుంది. అందుకోసం తమ మధ్య సంబంధం ఉన్నట్లు ఊళ్లో ప్రచారం చేస్తుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో భాగ్యరాజ్ ఊర్వశిని వివాహం చేసుకుంటాడు. కానీ, ఆమెను ద్వేషిస్తుంటాడు. మరి భర్త మనసును గెలవడానికి ఊర్వశి ఏం చేసిందన్నది ఈ చిత్ర కథ. థియేటర్లో 25 వారాల పాటు ప్రదర్శితమై ఘన విజయం సాధించింది.
ఎంగ చిన్న రాసా(Enga Chinna Rasa): కన్నడ నవల ‘అర్ధాంగి’ ఆధారంగా భాగ్యరాజ్ తెరకెక్కించిన మరో చిత్రం ‘ఎంగ చిన్న రాసా’. భాగ్యరాజ్, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘అబ్బాయిగారు’ టైటిల్‌తో ఈవీవీ సత్యనారాయణ రీమేక్ చేశారు. వెంకటేశ్, మీనా నాయకా నాయికలుగా నటించారు. హిందీలో ‘బేటా’, కన్నడలో ‘అన్నయ్య’గా రీమేక్ అయింది. ‘బేటా’ అనిల్ కపూర్ కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
కథేంటంటే: భాగ్యరాజ్ తల్లి చనిపోవడంతో అతడి తండ్రి నాగమణిని రెండో వివాహం చేసుకుంటాడు. మరణానికి ముందు భాగ్యరాజ్ తల్లి తన ఆస్తినంతా కుమారుడికి చెందేలా వీలునామా రాస్తుంది. అయితే అతడు వివాహం చేసుకున్న తరువాతే ఆ ఆస్తిని విక్రయించొచ్చని షరతు విధిస్తుంది. ఆ ఆస్తిని చేజిక్కించుకోవాలన్న దురాశతో ఉన్న నాగమణి.. సవతి కుమారుడైన భాగ్యరాజ్‌పై కపటప్రేమ నటిస్తూ అతణ్ని తన చెప్పుచేతల్లో ఉంచుకుంటుంది. ఆ తరువాత భాగ్యరాజ్ రుక్మిణి(రాధ)ని వివాహం చేసుకుంటాడు. నాగమణి దుర్బుద్ధిని బయటపెట్టడానికి రుక్మిణి ఏం చేసింది? తన భర్తను, సంసారాన్ని చక్కదిద్దుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలేంటి? ఆ క్రమంలో నాగమణి, ఆమె సొంత కుమారుడి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయన్నది ఈ సినిమా కథాంశం.
చిన్నవీడు(Chinna Veedu): ఊర్వశి సోదరి కల్పనతో కలసి భాగ్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘చిన్నవీడు’. అంటే తెలుగులో చిన్నిల్లు అని అర్థం. కన్నడలో ‘చపల చెన్నిగరాయ’ పేరుతో రీమేక్ అయింది.
కథేంటంటే: భాగ్యరాజ్ తనకు కాబోయే భార్య అపురూప సౌందర్యవతిలా ఉండాలని కలలు కంటాడు. అతడికి మంచి పలుకుబడి, డబ్బు ఉన్న కుటుంబానికి చెందిన కల్పనతో వివాహం నిశ్చయమవుతుంది. కానీ, లావుగా ఉన్న కల్పనను పెళ్లి చేసుకోవడానికి భాగ్యరాజ్‌కు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇదిలా ఉండగా భాగ్యరాజ్ చెల్లెలికి, కల్పన అన్నకు కూడా వివాహం చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. ఈ పరిస్థితుల్లో కుటుంబ పరువు కోసం కల్పనను పెళ్లి చేసుకుంటాడు. కానీ, ఆమెతో సంసారం చేయడు. ఆమె రూపం గురించి అవమానకరంగా మాట్లాడుతూ.. దూరం పెడతాడు. అయినప్పటికీ ఆమె సహనంతో ఉంటూ భర్తలో మార్పు వస్తుందని ఆశతో ఎదురుచూస్తుంటుంది. అయితే భాగ్యరాజ్ మాత్రం తాను అవివాహితుడినని చెప్పుకొంటూ అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ వేశ్య అమాయకురాలిగా నటిస్తూ అతణ్ని వలలో వేసుకుంటుంది. ఆమె నుంచి తన భర్తను కాపాడుకోవడానికి కల్పన ఎలాంటి ప్రయత్నాలు చేసింది? ఆ క్రమంలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? భార్యకు తన మీద ఉన్న ప్రేమను భాగ్యరాజ్ అర్థం చేసుకున్నాడా అన్న విషయాలను ఈ చిత్రంలో చూపించారు. దాంపత్య బంధానికి ఉన్న పవిత్రతను చాటిచెప్పేలా తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇండ్రు పొయ్ నాలయ్ వా(Indru Poi Naalai Vaa): భాగ్యరాజ్, రాధిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇండ్రు పొయ్ నాలయ్ వా’. ఒకే అమ్మాయిని ఇష్టపడిన ముగ్గురు స్నేహితులు ఆమెను దక్కించుకోవడానికి ఎలాంటి పాట్లు పడ్డారన్న కథాంశంతో, హాస్య ప్రధాన ప్రేమకథా చిత్రంగా భాగ్యరాజ్ దీన్ని తెరకెక్కించారు.
కథేంటంటే: రాధిక హిందీ పండిట్ అయిన తన తండ్రితో కలసి భాగ్యరాజ్ ఎదురింట్లోకి కొత్తగా వస్తుంది. ఆమెను చూసిన వెంటనే భాగ్యరాజ్తోపాటు అతడి ఇద్దరు స్నేహితులు మనసు పారేసుకుంటారు. అయితే రాధిక ప్రేమను గెలుచుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగించొచ్చని, అందులో సఫలీకృతులైన వారికి ఆమె దక్కుతుందని, మిగిలినవారు తనను మర్చిపోవాలని స్నేహితులు ఒప్పందం చేసుకుంటారు. ఇందులో భాగంగా ఒకరు రాధిక తల్లికి వంటగదిలో సాయం చేయడానికి వెళ్తుంటే, మరొకరు ఆమె తండ్రి వద్ద హిందీ నేర్చుకోవడానికి ట్యూషన్లో చేరుతారు. మరొకరు ఆమె తాత వద్ద మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి సిద్ధమవుతారు. వారి ప్రయత్నాలు ఎలా సాగాయి? చివరకు ఎవరు ఆమె మనసును గెలుచుకున్నారన్న విషయాలను వినోదాత్మకంగా తెరకెక్కించారు. ముఖ్యంగా హిందీ నేర్పించడానికి రాధిక తండ్రి ‘ఏక్ గావ్ మే ఏక్ కిసాన్ రెహతా థా’(ఒక గ్రామంలో ఒక రైతు నివసించేవాడు) అని చెప్పమనడం, అది అర్థం కాక భాగ్యరాజ్ స్నేహితుడు ‘ఏక్ గావ్ మే ఏక్ కిసాన్ రఘు తాత’ అని పదే పదే పలకడం ఓ ఐకానిక్ సీన్‌గా నిలిచిపోయింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.