
Vaibhav Sooryavanshi: కోచ్‌కు కన్నుకొట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఆసక్తికర విషయం చెప్పిన సంగా! Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ ప్రతిభతో ఇప్పటికే ప్రపంచ క్రికెట్ దృష్టిని...
Vaibhav Sooryavanshi: కోచ్‌కు కన్నుకొట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఆసక్తికర విషయం చెప్పిన సంగా!
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ ప్రతిభతో ఇప్పటికే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శన చేశాడు. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తరఫున 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.
అంతేకాకుండా ఒకే సీజన్లో 72 సిక్సర్లు బాది.. 2012లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ నెలకొల్పిన 59 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం భారత జట్టుకు ఎంపికైన బుడ్డోడు.. అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే తాజాగా రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర వైభవ్ ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను వెల్లడించారు. ఓ మ్యాచ్ సందర్భంగా వైభవ్ తనకు కన్నుకొట్టి టెన్షన్ పడొద్దని చెప్పాడని తెలిపారు.
స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమార సంగక్కర మాట్లాడుతూ.. ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ ఎంత ధీమాగా మాట్లాడాడో వివరించారు. ఆ మ్యాచ్‌లో 221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.. ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు వైభవ్ తన వద్దకు వచ్చి కన్నుకొట్టి 'కోచ్.. టెన్షన్ పడొద్దు. మ్యాచ్ అయిపోయినట్టే' అని చెప్పాడని సంగక్కర వెల్లడించారు.
ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి సహచర ఆటగాళ్లు డోనోవన్ ఫెరీరా, లుహాన్-డ్రే ప్రిటోరియస్తో మాట్లాడుతూ.. 'నేను ఇప్పుడు 13 సిక్సర్లు కొడతా. ఆ తర్వాత మీరు మిగతా పని పూర్తి చేయండి' అని చెప్పాడని సంగక్కర గుర్తు చేశారు. మొదట్లో అది సరదాగా చెప్పాడని అందరూ భావించినా.. ఐదు సిక్సర్లు పూర్తయ్యాక అతని మాటలు నిజమవుతున్నాయేమోనని సహచరులు సిక్సర్ల లెక్క పెట్టడం ప్రారంభించారని తెలిపారు.
ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 48 బంతుల్లో 93 పరుగులు చేసి 10 భారీ సిక్సర్లు బాదాడు. అతను చెప్పిన 13 సిక్సర్ల లక్ష్యాన్ని చేరుకోకపోయినా.. తన ఆత్మవిశ్వాసానికి తగ్గట్టే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ధ్రువ్ జురెల్ 38 బంతుల్లో అజేయంగా 53 పరుగులు చేయడంతో రాజస్థాన్ రాయల్స్ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. వైభవ్ ఏ ప్రత్యర్థి అయినా, ఎంతటి ఒత్తిడి పరిస్థితి అయినా భయపడకుండా ఆడతాడని సంగక్కర ప్రశంసించారు. అతడిలో కనిపించే ఆత్మవిశ్వాసమే అతన్ని ప్రత్యేక ఆటగాడిగా నిలబెడుతోందని చెప్పారు.
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన చేసిన రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2 వరకు చేరుకుంది. కీలక మ్యాచులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయినప్పటికీ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన మాత్రం మొత్తం సీజన్లోనే హైలైట్‌గా నిలిచింది. ఐపీఎల్ 2025, దేశవాళీ టోర్నీలలో, అండర్ 19 ప్రపంచకప్ 2026, ఐపీఎల్ 2026 ప్రదర్శనల కారణంగా బుడ్డోడికి 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు దక్కింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లలో బీసీసీఐ అతడికి అవకాశం ఇచ్చింది. శుక్రవారం ఐర్లాండ్ జట్టుతో జరిగిన మొదటి మ్యాచులో బుడ్డోడికి చోటు దక్కలేదు. త్వరలోనే అవకాశం రానుంది.
2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్సైట్లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.