
Venezuela Earthquake| ఇంటర్నెట్డెస్క్: కొన్ని సెకన్ల విలయం ఎన్నో కుటుంబాల భవిష్యత్తును చిదిమేసింది. అదే సమయంలో.. ఓ కన్నతండ్రి గుండె మాత్రం మళ్లీ కొట్టుకుంది.
తల్లి కౌగిలి లేకపోతే క్షణం ఉండలేని పసికందు.. శిథిలాల అడుగున పడిపోయింది. చివరకు సజీవంగా కనిపించి.. వెనెజువెలా పెనువిపత్తులో మృత్యువును జయించింది. ఆ చిన్నారిని బయటకు తీస్తున్నప్పుడు వినిపించిన కేరింతలు ఆ ప్రాంతాన్ని ఉద్విగ్నంగా మార్చాయి.
వెనెజువెలాలో బుధవారం సాయంత్రం క్షణాల వ్యవధిలో జంట భూకంపాలు (Earthquake) రావడంతో వందల భవనాలు కుప్పకూలాయి. దాంతో వేలాదిమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఓ ప్రాంతంలో 18 రోజుల పసికందు తల్లితో సహా శిథిలాల కింద చిక్కుకుపోయింది. తన భార్యబిడ్డ అసలు బతికున్నారో లేదో తెలియక వారికోసం వెతుకుతూ తండ్రి తల్లడిల్లాడు. అక్కడ రెస్క్యూ సిబ్బంది ఒక్కో సిమెంట్ దిబ్బను తొలగిస్తుంటే.. ఆ తండ్రి గుండె వేగంగా కొట్టుకోసాగింది.
చివరకు ప్రయత్నం ఫలించి రోజుల బిడ్డ ప్రాణాలతో కనిపించింది. ఆ బిడ్డను వస్త్రంలో చుట్టి ఎంతో అపురూపంగా తండ్రికి అందించడంతో ఆయన గుండె మళ్లీ కొట్టుకున్నట్లయింది. చిన్నగాయం లేకుండా పాలకోసం ఎదురుచూస్తున్న ఆ బిడ్డను చూసి ప్రతి ఒక్కరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఒకవైపు బిడ్డ దొరికిందన్న ఆనందం.. మరోవైపు భార్య పరిస్థితి ఎలా ఉందో తెలియని పరిస్థితి. చివరకు 90 నిమిషాల తర్వాత ఆ తల్లి కూడా సజీవంగా ఉందన్న వార్త వినిపించింది. దాంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు (Venezuela Earthquake Miracle). ఈ భారీ విపత్తు నుంచి ఆ కుటుంబం బయటపడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.