
తొడిగిన చొక్కా తొడగకపోవడం... కొందరికి సరదా. వేసిన డ్రెస్ వేయకపోవడం... ఇంకొందరికి ఘనత. కానీ విచ్చలవిడిగా బట్టలు కొనడం... ఒకట్రెండుసార్లు వాడేసి బీరువాలో కుక్కేయడం.
అవి కొన్నాళ్లకు పాత బట్టలుగా మారిపోవడం.. ఇదంతా ఓ సంక్షోభానికి దారి తీస్తోందని తెలుసా?
మారుతున్న ఫ్యాషన్లు, మన అభిరుచులకు అనుగుణంగా కొత్త దుస్తుల్ని తెగ కొనేస్తుంటాం. వాటిని 8-10సార్లు వాడతామో లేదో బీరువాల్లో కుక్కేస్తుంటాం. మళ్లీ ఎప్పుడు బయటికి తీస్తామో తెలియదు. ఎక్కవసార్లు ధరించకుండానే అవి పాతబడిపోతుంటాయి. వాటిని స్వచ్ఛంద సంస్థలకో, పేదలకో ఇచ్చేయాలని చూస్తుంటాం. పాత దుస్తుల్ని తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. సేకరించిన దుస్తుల్ని కొందరు విదేశాలకు ఎగుమతి చేసి, నిరుపేద దేశాల మార్కెట్లలో విక్రయిస్తుంటారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసిన ఐరోపా పరిశోధకులు.. పాత దుస్తులు ప్రపంచవ్యాప్తంగా ఓ సమస్యగా తయారైన విషయాన్ని గుర్తించారు. ఆలోచించాల్సిన విషయం ఎన్ని దుస్తులు కొంటున్నామని కాదు, వాటిని ఎంత తక్కువగా ధరిస్తున్నామనేది..
దుస్తులు ఇలా పోగుబడి పోవడం కేవలం చిందరవందర సమస్యేకాదని, కార్బన్ ఉద్గారాల సమస్య అని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతి వస్త్రం హ్యాంగర్‌కు చేరడానికి చాలా కాలం ముందే గణనీయమెన పర్యావరణ ప్రభావాన్ని కలగజేస్తుంది. వస్త్రం ఉత్పత్తి, నూలు వడకడం, నేయడం, రంగు వేయడం, కత్తిరించడం, కుట్టడం, ప్యాకేజింగ్, ప్రపంచవ్యాప్త రవాణా.. ఇలా ప్రతిఅంశంలోనూ పర్యావరణ ప్రభావం ఇమిడి ఉంటుంది. ఒక వస్త్రం వ్యర్థంగా మిగిలిందంటే.. దానికి ఎన్నో వనరుల్ని వినియోగించారని, అది ఉద్గారాలను వెలువరించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలా సంస్థల దగ్గర ఇప్పటికే పాత దుస్తులు గుట్టలుగా పోగుబడి ఉన్నాయి. ఇంకొన్ని స్వచ్ఛంద సంస్థలు విదేశాలకు ఎగుమతి చేస్తాయి. వాటిలో చాలావరకు చెత్తబుట్టల్ని చేరతాయి. అలా చేరినవి పర్యావరణ సమస్యల్ని సృష్టిస్తూనే ఉన్నాయి.
దుస్తుల్ని కొన్న తర్వాత ఎన్నిసార్లు ధరిస్తున్నారనే దానిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. యురోపియన్ యూనియన్ చెప్పిన కనీస వినియోగ సంఖ్యలను చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో లెక్కించారు. దానికో సూత్రాన్ని పాటించారు. ధరించే తరచుదనాన్ని, వార్డ్రోబ్ పరిమాణాన్ని గణించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారికి సగటున 23 డ్రెస్సులు ఉన్నాయి. వారు ఓ డ్రెస్‌ను వారానికోసారి ధరిస్తే, ప్రతి డ్రెస్‌ను 70 సార్లు ధరించడానికి దాదాపు 31 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ వారు వారానికి ఐదుసార్లు ఆ డ్రెస్సును ధరిస్తే, ఆ కాలపరిమితి ఆరున్నర సంవత్సరాలకు తగ్గుతుంది. డ్రెస్సుల సంఖ్య పెరిగే కొద్దీ, ధరించే సమయమూ పెరుగుతుంది. ఈ కారణంగానే ఎక్కువ దుస్తులు బీరువాలకే పరిమితమవుతున్నాయి. సుస్థిరత అంటే సరైన సంఖ్యలోనే దుస్తుల్ని కలిగిఉండటం లేదా బీరువాలో సగం దుస్తుల్ని తొలగించడమని కాదు. మనకు ఎన్ని దుస్తులున్నాయి? వాటిని ఎంత తరచుగా ధరిస్తాం? అవి పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? అనేవే అసలైన సుస్థిరతలు.
మనం వస్త్రాన్ని ఎన్నిసార్లు ధరించాం అనే దానిని బట్టి పర్యావరణ ప్రభావం ఆధారపడి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ప్రతి అదనపు ధారణ ఆ వస్త్రం కార్బన్ పాదముద్రను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వివిధ రకాల దుస్తులకు అవసరమైన కనీస ధారణల సంఖ్యను యురోపియన్ యూనియన్ లెక్కించింది. దాని ప్రకారం...
చొక్కాలు, బ్లౌజులు: కనీసం 40 సార్లు ధరించాలి.
ప్యాంట్లు, షార్ట్‌లు, స్కర్ట్లు, జంప్ సూట్లు, లెగ్గింగ్‌లు: 70 సార్లు
జంపర్లు, కార్డిగన్లు, హుడీలు: 85 సార్లు
కొందరు ఈ సంఖ్య కంటే చాలా ఎక్కువసార్లు, లేదా తక్కువసార్లు ధరిస్తూ ఉండొచ్చు. అది వారివారి ఆర్థిక స్థోమత, అభిరుచుల్ని బట్టి ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.